కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమికి అసోంలో ప్రజలు రెడ్ కార్డ్ చూపించారని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బోడో ప్రభావిత ప్రాంతాల్లో అంతులేని హింస పట్ల కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. కోక్రాజర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"తొలి దశ పోలింగ్లో అసోం ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించారు. అసోం యువత ఫుట్బాల్ బాగా ఆడతారు. వారి భాషలో చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమికి ప్రజలు రెడ్ కార్డ్ చూపించారు. అసోం సంక్షేమం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. మా ఘన విజయంపై ప్రజలు ఆమోదముద్ర వేశారు."
- నరేంద్ర మోదీ, ప్రధాని
శాంతిని బహూకరించాం..
బోడో ప్రభావిత ప్రాంతాల్లో హింసను అరికట్టడానికి కేంద్రంలో, రాష్ట్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేదని మోదీ విమర్శించారు. ఆ పార్టీ సుదీర్ఘ పాలనలో బోడోల్యాండ్.. బాంబులు, తుపాకులు, దిగ్బంధన సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ.. శాంతి, గౌరవాన్ని బహూకరించిందని చెప్పారు.
కాంగ్రెస్ లొంగిపోయింది..
అసోంలో తీవ్ర సమస్యగా ఉన్న అక్రమ వలసలను ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ప్రోత్సాహిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాళం, తాళం చెవికి (ఏఐయూడీఎఫ్ పార్టీ గుర్తు) కాంగ్రెస్ లొంగిపోయిందని మోదీ విమర్శించారు. దానికి వారు తగిన శిక్ష అనుభవిస్తారని అన్నారు.
కష్టపడి సాధించుకున్న శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కొల్లగొట్టనీయబోమని మోదీ చెప్పారు. అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ఎన్డీఏను ప్రజలు విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ