pegasus spyware: పెగాసస్ స్పైవేర్ వివాదానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ప్రస్తుతం ఈ వివాదాస్పద అంశం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో ఉందని విదేశీ వ్యవహారాల మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంచలన కథనంపై అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు స్పందించారు.
ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగసస్‌కు కూడా డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్ కథనంలో ఏముందంటే..
New York Times Report Pegasus: పెగసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. "ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ గత దశాబ్ద కాలంగా నిఘా సాఫ్ట్‌వేర్‌లను సబ్‌స్క్రిప్షన్ విధానంలో చట్టసభలు, నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. అమెరికా ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు ఈ స్పైవేర్‌ను విక్రయించగా.. దీన్ని వినియోగించలేదు. భారత్ కూడా దీన్ని కొనుగోలు చేసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 2017న జులైలో మోదీ తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం అదే తొలిసారి. ఆ సమయంలోనే ఇరు దేశాల మధ్య అధునాతన ఆయుధాల, సాంకేతిక మార్పిడి కోసం ఇజ్రాయెల్‌తో మోదీ 2 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్‌లోనే పెగసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయి. ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్‌లో పర్యటించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 2019 జూన్‌లోనే ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత్ ఓటువేసింది" అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నట్లు పీటీఐ న్యూస్ వార్తా కథనం వెల్లడించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'ఆ దేశాలతో భారత్‌కు ముప్పు.. ఇప్పటికే ట్రైలర్లు!'