పాస్‌పోర్టు పొందడం అంత సులువైన విషయమేమి కాదు. అభ్యర్థులు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి చిరునామా సరైనదా కాదా..? అభ్యర్థిపై కేసులు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు పరిశీలిస్తారు. పోలీసులు ఒకే అంటేనే పాస్‌పోర్టు మంజూరు అవుతుంది. దేశంలో ఎక్కడైనా ఇదే విధానం ఉంటుంది. అయితే, ఉత్తరాఖండ్‌లో ఇకపై పాస్‌పోర్టు జారీ చేసే ముందు అభ్యర్థుల సోషల్‌మీడియా ఖాతాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.
పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు వెరిఫికేషన్ చేసే ప్రక్రియలో భాగంగా వారి సోషల్‌మీడియా ఖాతాలనూ పోలీసులు పరిశీలించనున్నారు. దేశానికి సంబంధించి అభ్యంతరకర పోస్టులు లేకపోతేనే పాస్‌పోర్టు మంజూరు చేయనున్నారు. దేశ ద్రోహానికి సంబంధించిన పోస్టులు చేసి ఉంటే మాత్రం వారికి పాస్‌పోర్టు మంజూరు కానివ్వరు. ఇటీవల కాలంలో ఆందోళనలు, నిరసనలు, దేశద్రోహ చర్యలు, వాటిపై చర్చలకు సోషల్‌మీడియా వేదికగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ చెప్పారు. ఇది కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కాదని, దేశద్రోహానికి పాల్పడే వ్యక్తులకు పాస్‌పోర్టు మంజూరు చేయకూడదని పాస్‌పోర్టు చట్టాల్లోనే ఉందని పేర్కొన్నారు. దాన్నే తాము అమలు చేయబోతున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : జమ్ముకశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ పునరుద్ధరణ