- 'గరీభీ హటావో- దేశ్ బచావో'.. ఈ నినాదం 1971లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి కావడానికి ఎంతలా దోహదం చేసిందో చరిత్రే చెబుతుంది.
- 'సబ్‌కో దేఖో బారీ బారీ... అబ్‌కీ బారీ అటల్ బిహారీ'.. 1996 ఎన్నికల్లో ఈ నినాద ప్రభావం అంతా ఇంతా కాదు. వాజ్‌పేయీ ప్రధాని కావడంలో, దేశవ్యాప్తంగా భాజపా విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.
Punjab assembly election: అసెంబ్లీ ఎన్నికలైనా.. లోక్‌సభ పోరు అయినా.. సమకాలీన భారత రాజకీయాల్లో నినాదాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రజల్లోకి పార్టీ చొచ్చుకుపోయేందుకు.. అభ్యర్థిని ఓటర్లకు మరింత చేరువ చేసేందుకు ఇవే బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తుంటాయి. ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలు దేశంలోని ఎంతో మంది నేతలకు వజ్రాయుధాలుగా మారి.. వారి రాతలను మార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే ఈ నినాదాల రాజకీయం.. మిగతా రాష్ట్రాలతో పోల్చితే పంజాబ్‌లో ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ పడి మరీ నినాదాలు ఇస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు. పాత నినాదాలు కాకుండా.. ప్రజలతో మదిలో నిలిచేలా సరికొత్త స్లోగన్స్ ఇస్తూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు.
- శిరోమణి అకాలీదళ్- జో కియా ఓ కిట్టా, జో కహానే కరంజ
- భారతీయ జనతా పార్టీ- సిరాజంగే నవ పంజాబ్, భాజపా దే నాల్
- ఆమ్ ఆద్మీ పార్టీ- పంజాబ్ ది ఆన్ బాన్ షాన్, భగవంత్ మాన్
- కాంగ్రెస్- ఘర్ ఘర్ దే విచ్ చలీ గల్ చన్నీ కర్దా మసల్ హాల్
ఆయా పార్టీలకు చెందిన ఈ నినాదాలు రాష్ట్రంలో విస్తృత ప్రాచుర్యం పొందాయి. వీటితోపాటు మరికొన్నింటితో ప్రచారాల్లో హోరెత్తిస్తున్నారు నాయకులు.
'దిల్ విచ్ పంజాబ్', 'నవీ సోచ్ నవన్ పంజాబ్', 'కాంగ్రెస్ మాంగే సర్బత్ దా భలా' నినాదాలతో ప్రజల్లోకి వెళ్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. మరోసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆశపడుతోంది.
'సర్ బత్ దా భలా' (అందరి సంక్షేమం) అనేది.. ప్రముఖ సిక్కు గురు గోబింద్ సింగ్ ఇచ్చిన నినాదం. అయితే దీన్ని రాజకీయ ప్రచారంలో స్లోగన్‌గా చేసింది కాంగ్రెస్ పార్టీ. సిక్కు మత నినాదాన్ని వక్రీకరించి.. రాజకీయాల్లోకి వినియోగించారంటూ.. శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ( ఎస్జీపీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
2017 ఎన్నికల్లో 'రాజ్ నహీ సేవ' నినాదాన్ని అకాలీదళ్ ప్రముఖంగా వినిపించింది. ఆయితే ఆ ఎన్నికల్లో అకాలీదళ్ ఓడిపోయింది. ఈ సారి మాత్రం 'జో కహా వహీ కియా, 'జో కహెంగే', 'వహీ కరేంగే' లాంటి కొత్త నినాదాలతో ప్రచారం చేస్తోంది అకాలీదళ్.
'నవ పంజాబ్ భాజపా దే నాల్' నినాదంతో కూడిన థీమ్ సాంగ్‌తో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది భాజపా. 'న్యూ పంజాబ్ విత్ బీజేపీ' థీమ్ సాంగ్‌ను కూడా ఇటీవల విడుదల చేసింది కాషాయ పార్టీ. ఈ పాటను ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ పాడారు. అలాగే భాజపా మిత్ర పక్షాలు పంజాబ్ లోక్ కాంగ్రెస్, సంయుక్త అకాలీదళ్ 'సబ్సే పెహ్లే పంజాబ్', 'సోచ్ వికాస్ దీ' స్లోగన్స్‌తో దూసుకుపోతున్నాయి.
'పంజాబ్ ద మాన్'
ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కేజ్రీవాల్‌తో పాటు సీఎం అభ్యర్థి మాన్ పేరుతో కూడిన ప్రచార నినాదాలను ఇస్తూ.. విశేషంగా ఆకర్షిస్తోంది. 'కేజ్రీవాల్-కేజ్రీవాల్', 'సారా పంజాబ్ తేరే నాల్', 'పంజాబ్ ద మాన్', 'ఇక్ మౌకా కేజ్రీవాల్ ను', 'అబ్ పంజాబ్ బద్లేంగే' అంటూ.. తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కేజ్రీవాల్ దళం.
ఇదిలా ఉంటే.. కొన్ని రైతు సంఘాలు కూటమిగా ఏర్పడి.. సంయుక్త సమాజ్ మోర్చాతో పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఎలాంటి నినాదం ఇవ్వకుండానే ఈ కూటమి బరిలోకి దిగుతోంది.
నినాదాలకు అంత పవర్ ఉందా?
అయితే నిజంగా నినాదాలకు అంత పవర్ ఉందా? అవి ఓటర్లను ప్రభావితం చేస్తాయా? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. ఆకర్షణీయంగా ఉండే నినాదాలు ప్రజల మదిలో గుర్తుండిపోతాయంటున్నారు చండీగఢ్‌కు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సుధీర్ గుప్తా.
''ఆకర్షణీయంగా ఉండే నినాదాలు ఓటరు ఆలోచనను ప్రభావితం చేస్తాయి. స్లోగన్స్ ఓటర్లను ఆకర్షిస్తాయి. అందుకే రాజకీయ పార్టీలు పోటీ పడి నినాదాలు ఇస్తున్నాయి.''
- డాక్టర్ సుధీర్ గుప్తా, సైకియాట్రిస్ట్, చండీగఢ్
కొసమెరుపు..
వ్యక్తిగత ఇమేజ్ పెంచేలా.. పార్టీలను పొగుడుతూ.. ఇలా ఎన్నో రకాల నినాదాలు ఇచ్చిన పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు.. ప్రధాన సమస్యలపై మాత్రం ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. పేదరికం, నిరుద్యోగం, విద్య, ద్రవ్యోల్బణం, వ్యవసాయంపై ఎలాంటి నినాదాలు చేయలేదు.
ఇదీ చదవండి: చన్నీనే సీఎం అభ్యర్థి.. సిద్ధూ ఊరుకుంటారా మరి?