పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాజ్యసభను వాయిదా వేస్తూ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు. వాయిదాకు ముందు నాలుగు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధానంగా ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా సజావుగా సాగిన రాజ్యసభ.. బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన సవరణ బిల్లు ఆమోద సమయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంది. ఓబీసీ బిల్లుతో పాటు..
- ప్రభుత్వ బీమా కంపెనీలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి వీలు కల్పించే 'జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) సవరణ బిల్లు-2021 రాజ్యసభ ఆమోదం పొందింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
- నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి (సవరణ) బిల్లు-2021 పెద్దల సభలో గట్టెక్కింది.
- నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(సవరణ) బిల్లు-2021 బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.
ఆఖర్లో గందరగోళం..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా.. ప్రతిపక్ష సభ్యులు వెల్ వద్దకు దూసుకెళ్లడం వల్ల సభలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. కొందరు కాగితాలు చింపివేయడం కనిపించింది. బిల్లును సభలోని సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రెండుసార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. వర్షాకాల సమావేశం ప్రారంభమైననాటి నుంచే పెగసస్ అంశం ఉభయసభలను కుదిపేసింది. ఈ కారణంగా గడువుకన్నా ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా పడింది.
'నిరాశాజనకంగా పనితీరు..'
వర్షాకాల సెషన్‌లో రాజ్యసభ కేవలం 28 శాతం ఉత్పాదకతను నమోదు చేసిందని ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మొత్తం 17 సార్లు భేటీ అయిన సభ.. 28 గంటల 21 నిమిషాల పాటు కొనసాగింది. పలు అంతరాయాల కారణంగా 76 గంటల 26 నిమిషాలు వృథా అయ్యాయి. 19 బిల్లులు ఆమోదం పొందాయి.
లోక్‌సభ సైతం..
అంతకముందు లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. పెగసస్ హ్యాకింగ్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో రెండు రోజుల ముందే దిగువ సభ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉండగా సభ్యుల ఆందోళనల మధ్య చర్చలకు ఆస్కారం లేకపోయింది. ఫలితంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేయడానికి ముందు ఎంపీలు.. ఇటీవలే మరణించిన నలుగురు లోక్‌సభ సభ్యులకు నివాళులర్పించారు.
చాలా బాధగా అనిపించింది..
వాయిదా అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఓం బిర్లా. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడం బాధించిందని తెలిపారు. సభ ప్రతిష్ఠను తగ్గించేలా సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడం, ఆందోళన చేయడం సరికాదని అన్నారు.
17 రోజుల పాటు జరిగిన లోక్‌సభ సమావేశాల్లో.. 20 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ పేర్కొన్నారు. వీటిలో ఓబీసీ చట్ట సవరణ బిల్లు సహా, జనరల్ ఇన్సూరెన్స్, కొబ్బరి బోర్డు, పన్ను చట్టాలు, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ వంటి ముఖ్యమైన చట్ట సవరణ బిల్లులు ఉన్నట్లు ఓం బిర్లా చెప్పారు. మొత్తంగా 21గంటల 14 నిమిషాలపాటు జరిగిన లోక్‌సభ సమావేశాల్లో విపక్షాల ఆందోళన మధ్యే ఈ బిల్లులను సభ ఆమోదించింది.
ఇవీ చదవండి: