పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన తర్వాత తొలిసారిగా మంగళవారం లోక్‌సభలో భిన్నమైన వాతావరణం సాక్షాత్కరించింది. నిరసనలు, వాగ్వాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంత పరిస్థితుల్లో 'ఓబీసీ బిల్లు'పై సభ చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదించింది. ఓబీసీల జాబితా రూపకల్పనలో రాష్ట్రాలకు ఇదివరకు ఉన్న అధికారాలను పునరుద్ధరించడానికి వీలు కల్పించే 105వ రాజ్యాంగ సవరణ బిల్లుకు విపక్షమంతా సమ్మతించడంతో ఇది సాధ్యమయింది. బిల్లుకు అనుకూలంగా 385 మంది ఓటు వేయగా ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. ఈ బిల్లు వరకు తమ ఆందోళనను పక్కనపెడతామని ముందుగా ప్రకటించిన రీతిలోనే విపక్షాలు స్పందించాయి. చర్చ సందర్భంగా కొన్ని సూచనలు చేశాయి. రిజర్వేషన్లపై ఉన్న 50% గరిష్ఠ పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు పట్టుబట్టాయి.
671 కులాలకు ప్రయోజనం: కేంద్రం
సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఇదొక చరిత్రాత్మక అడుగు అని, దేశంలో 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని చెప్పారు. వివిధ కులాలకు సామాజికంగా, ఆర్థికంగా న్యాయం చేయడంలో రాష్ట్రాల హక్కుల్ని ఇది పునరుద్ధరిస్తుందని తెలిపారు. బిల్లుకు తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి తెలిపారు. 2018లో సర్కారు తీసుకువచ్చిన సవరణను తప్పుపట్టారు. అప్పట్లో విపక్షం చేసిన సూచనను ప్రభుత్వం పరిగణనలో తీసుకుని ఉంటే ఇబ్బందులు వచ్చి ఉండేవే కాదన్నారు. రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్లు కల్పించుకునేందుకు చట్టబద్ధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదే డిమాండును మరికొందరు విపక్ష నేతలూ వినిపించారు. దేశాన్ని నాలుగు దశాబ్దాల పాటు పాలించినా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో కాంగ్రెస్ విఫలమైందని కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాల ఓబీసీ జాబితాలు విడిగా ఉండాలనేది పార్లమెంటు ఉద్దేశమని వివరించారు. ఎన్సీపీ, వైకాపా, శివసేన వంటి ఇతర పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి.
కులాలవారీగా జనగణనకు డిమాండ్
కులాల వారీ జనగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని లలన్ సింగ్ (జేడీ-యూ), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ), రీతేశ్ పాండే (బీఎస్పీ), టి.ఆర్.బాలు (డీఎంకే) తదితరులు డిమాండ్ చేశారు. అనూహ్య రీతిలో భాజపా ఎంపీ సంఘమిత్ర మౌర్య కూడా వీరికి మద్దతు పలికారు. అనేక ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న ఈ అంశంపై భాజపా ఇంతవరకు తన వైఖరేమిటో స్పష్టం చేయకపోయినా ఆ పార్టీ సభ్యురాలు ఇలా చేయడం అధికార పక్షాన్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 'మునుపటి ప్రభుత్వాలు చేయలేని పనిని మా ప్రభుత్వం చేస్తోంది. కులగణన ద్వారా ఓబీసీలకు హక్కులు కల్పిస్తోంది. గతంలో జంతువుల్నీ లెక్కించినా బీసీలను మాత్రం లెక్కించలేదు. భాజపా ప్రభుత్వం ఆ పనిచేస్తోంది' అని ఆమె చెప్పారు. ఓబీసీ బిల్లును కులగణన బిల్లుగా పొరపడి ఆమె ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.
ఓబీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేకపోయినా వారిని ఓటుబ్యాంకుగా వాడుకుంటోందని అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) విమర్శించారు. కొన్ని పక్షాలు ప్రతిపాదించిన సవరణల్ని సభ తిరస్కరించింది.
ఇవీ చదవండి: