అత్యాచార బాధితులు, మైనర్లు, దివ్యాంగులు వంటి ప్రత్యేక కేటగిరీ మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు.. ప్రస్తుతం ఉన్న 20 వారాల గరిష్ట పరిమితిని 24వారాలకు పెంచేందుకు అనుమతిచ్చే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టిన వైద్యపరమైన గర్భవిఛ్చిత్తి సవరణ బిల్లు-2020కు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న డిమాండ్ సహా విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు సవరణలను రాజ్యసభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. అబార్షన్లపై అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడం సహా.. దేశీయంగా విస్తృత సంప్రదింపుల తర్వాత బిల్లులో సవరణలు చేసినట్లు హర్షవర్ధన్ తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకే వీటిని తీసుకువచ్చినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు హాని చేసేలా ఎలాంటి చట్టాన్ని రూపొందించబోదని ఆయన స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వారి పార్టీల సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నాయని అన్నారు.
ఇదీ చూడండి: 'అత్యాచార బాధితులకు హక్కుల గురించి చెప్పాల్సిందే'