PM Modi Twitter hack: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురికావడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ ఉన్నతాధికారులను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని స్థాయీసంఘం.. పెగసస్ అంశంపైనా అధికారులకు ప్రశ్నలు సంధించింది.
Pegasus hacking India
Tharoor IT panel on pegasus
పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనే అంశంపై థరూర్ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందని అధికారులు బదులిచ్చినట్లు వెల్లడించాయి. తమకు సహకరించాలని థరూర్ కోరినప్పటికీ.. అధికారులు వివరాలేవీ వెల్లడించలేదని పేర్కొన్నాయి. పెగసస్‌పై చెప్పాల్సింది ఏమీ లేదంటూ తప్పించుకున్నారని వివరించాయి.
మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ గురించీ అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీని వివరాలు ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పినట్లు సమాచారం.
ట్విట్టర్ ఖాతా హ్యాక్
ఆదివారం కొద్దిసేపు మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. బిట్కాయిన్లు చట్టబద్ధం చేసినట్లు మోదీ హ్యాండిల్ నుంచి ట్వీట్లు వెలువడ్డాయి. అయితే, దీని గురించి ట్విట్టర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇటీవల ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు వరుసగా హ్యాక్‌కు గురవుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ట్విట్టర్ అకౌంట్లను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్ ట్విట్టర్ ఖాతా (@narendramodi_in) కూడా హ్యాకింగ్ బారిన పడింది.
ఇదీ చదవండి: 'పక్కా ప్రణాళికతోనే లఖింపుర్ ఖేరి ఘటన'