పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు దఫాలుగా జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు సాగనున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు విరామం తర్వాత రెండో దఫా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 66 రోజుల పాటు సాగి.. ఏప్రిల్ 6న సమావేశాలు ముగియనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ట్విట్టర్ వేదికగా ప్రహ్లాద్ జోషి వివరాలు వెల్లడించారు.
తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం కేంద్ర బడ్జెట్ మీద చర్చ జరగనుంది. ఆ తర్వాత ప్రధాని.. రాష్ట్రపతి ప్రారంభోపన్యాసానికి కృతజ్ఞత ఉపన్యాసం ఇస్తారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి సమాధానాలు ఇస్తారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు.
మరోవైపు, పార్లమెంటు కొత్త భవనం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలను సెంట్రల్ విస్టా హాలులోనే నిర్వహించేందుకు భవనాన్ని సిద్ధం చేస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. గత సమావేశాల్లో కేంద్ర 9 బిల్లులు ప్రవేశపెడితే అందులో 7 బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం పొందాయి.
ఇదీ చదవండి : 'నూతన పర్యటక యుగానికి నాంది'.. 'గంగా విలాస్' నౌకను ప్రారంభించిన మోదీ