పెగసస్, వ్యవసాయ చట్టాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ఏడవ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ.. విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు.
లోక్‌సభలో..
లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా, విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకువచ్చారు. పెగసస్, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలు సాగుతున్నంత సేపు విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాయి. జులై 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ఎలాంటి వాయిదా లేకుండా పూర్తి కావడం ఇదే తొలిసారి.
ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత విపక్ష సభ్యులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. వెల్‌లోకి దూసుకువచ్చి స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు విసిరారు. విపక్షాల నిరసనలతో సభ ఐదు సార్లు వాయిదా పడింది. సభ మొదట 12:30 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడం వల్ల సభను 2గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత ప్రారంభమైనా అదే పరిస్ధితి నెలకొనగా.. అర గంట చొప్పున మరో మూడు సార్లు వాయిదా పడింది. 4 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ కొనసాగే స్ధితి లేకపోవడం వల్ల లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది.
రాజ్యసభలో..
రాజ్యసభ సమావేశం కాగానే దోలావీరాకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చిన అంశాన్ని ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రస్తావించగా.. సభ్యులంతా బల్లలు చరిచి అభినందనలు తెలిపారు. అనంతరం వెంకయ్య శూన్య గంటను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు పెగసస్, వ్యవసాయ చట్టాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబూని వెల్‌లో ఆందోళన నిర్వహించారు. విపక్షాల ఆందోళనతో ఛైర్మన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా విపక్షాలు మళ్లీ ఆందోళన కొనసాగించాయి. నినాదాలతో సభను హోరెత్తించాయి. విపక్షాల ఆందోళనతో గంట పాటైనా కొనసాగకుండానే సభ 2గంటల వరకు ఒకసారి, రెండు గంటల 45 నిమిషాల వరకు మరోసారి వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ బాలల న్యాయ సవరణ బిల్లు-2021కి ఆమోదం తెలిపింది. విపక్షాలు నిరసనలను ఉద్ధృతం చేయటం వల్ల సభను గురువారానికి వాయిదా వేశారు.
ఇదీ చూడండి: పార్లమెంటులో మళ్లీ అదే సీన్- వెంకయ్య ఆందోళన