కొద్ది కాలంగా దేశ ప్రజల్ని పట్టిపీడిస్తోన్న కొవిడ్ మహమ్మారి.. కర్ణాటకలోని ఓ కుటుంబంలో మాత్రం ఆనందం నింపింది. హసన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. 22 సంవత్సరాల క్రితం అదృశ్యమై.. ఎట్టకేలకు ఇప్పుడు ఇంటికొచ్చాడు. కరోనా కారణంగా ఉపాధి కరవై సొంతగూటికి పయనమై.. ఇటీవలే తన కుటుంబాన్ని కలిశాడు. దీంతో ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.
ఇదీ జరిగింది..
హొంగెరె గ్రామానికి చెందిన శంకర్.. తన 16ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి తల్లిదండ్రులు(రాజేగౌడ, అక్కాయమా) సుమారు ఏడాది కాలం పాటు వెతికారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురై వారి కుమారుడు తిరిగొస్తాడనే ఆశల్ని వదులుకున్నారు.
అలా అదృశ్యమైన శంకర్.. ఆంధ్రప్రదేశ్‌లో పానీపూరీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించాడు. ఆ తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. అంతకుముందు.. దుబాయ్‌కూ వెళ్లాడట.
అయితే.. కరోనా కారణంగా అతడి వ్యాపారం దెబ్బతినడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం వల్ల.. ఇంటికి తిరుగు పయనమయ్యాడు. సుదీర్ఘ కాలం తర్వాత శంకర్‌ను చూసిన వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇదీ చదవండి: కరోనా కాలంలో చేయాల్సినవి.. చేయకూడనివి..