Pakistan Retired Soldiers as Terrorists in India : భారత భూభాగంలోకి ఉగ్రవాదాన్ని ఎగదోసి, అస్థిరత సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. స్థానికంగా రిక్రూట్‌మెంట్లు నిలిచిపోవటంతో.. పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసిన మాజీ సైనికులతో ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతున్నట్లు తేలింది.
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరులైన సైనికుల పార్థివదేహాలకు ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. పాక్ ఆర్మీ ప్రత్యేక దళంలో పనిచేసిన కొందరు మాజీ సైనికులు కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెప్పారు. పెద్దఎత్తున సైనిక ఆపరేషన్లు, ఉగ్రసంస్థల్లో చేరేందుకు స్థానిక యువత విముఖత చూపటం వంటి కారణాల నేపథ్యంలో.. కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల కోసం పాకిస్థాన్ తమ మాజీ సైనికులను పురమాయిస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
"చనిపోయిన ఉగ్రవాదులను గుర్తించే క్రమంలో వారిలో కొందరు పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనిక సిబ్బంది ఉన్నట్లు తేలింది. స్థానికంగా రిక్రూట్‌మెంటు లేకపోవటంతో పాకిస్థాన్ విదేశీ ఉగ్రవాదులను పంపాలని భావిస్తోంది. విదేశీ ఉగ్రవాదులందరినీ అంతమొందిస్తాం."
-లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఉత్తర కమాండ్
ఉగ్ర తర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు
రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్ ఖౌరీ, అతని అనుచరుడు హతం కావటం పాకిస్థాన్‌కు శరాఘాతమని సైన్యం భావిస్తోంది. దాయాది దేశం ఉగ్ర కుట్ర ప్రణాళికలకు కోలుకోలేని దెబ్బగా ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పేర్కొన్నారు. రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులు ఏడాదికాలంగా ఘోరమైన హత్యలకు పాల్పడినట్లు తెలిపారు. ఉగ్ర సంస్థల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సమాచారం అందటం వల్ల.. వారిని పట్టుకోలేకపోయినట్లు చెప్పారు. ఈ ఏడాది జరిగిన 9మంది పౌరులు, ఐదుగురు సైనికుల హత్యలతో ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులకు ప్రమేయం ఉన్నట్లు ద్వివేదీ తెలిపారు. అమాయక ప్రజలను చంపినందుకే.. వారిని అంతమొందించాల్సి వచ్చిందన్నారు.
ఉగ్రవాదులను అంతమెందించి తీరుతాం
ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని సైన్యం అనుమానిస్తోంది. జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతమైన రాజౌరీ-పూంచ్ బెల్ట్‌లో 20నుంచి 25మంది విదేశీ ఉగ్రవాదులు ఉండొచ్చని సైనికాధికారులు అంచనా వేశారు. కశ్మీర్‌లోని స్థానికుల సహాయంతో.. భద్రతాదళాలు, నిఘావర్గాలు ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లను ఉద్ధృతంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ ఆపరేషన్ అదేవిధంగా కొనసాగితే ఏడాదిలోపు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సరిహద్దులో అలజడికి పాక్ కుట్ర.. 200 మంది ముష్కరులతో ప్లాన్!.. దేనికైనా సిద్ధమంటున్న భారత ఆర్మీ!
Terrorism: భారత్ లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు.. నదులే నావిగేటర్లు!