జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్లో ఉగ్ర చొరబాటు యత్నాన్ని భద్రత దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. సోమవారం సాయంత్రం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు (Kashmir Encounter Latest).. మరో ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. (terrorist caught) పట్టుబడ్డ ఉగ్రవాదిని పాకిస్థాన్ జాతీయుడిగా గుర్తించారు. వీరు బారాముల్లా జిల్లాలోని సరిహద్దు గుండా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. చొరబాటును అడ్డుకునే క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు.
శిబిరం గుట్టురట్టు
మరోవైపు, పుల్వామా జిల్లాలో పోలీసులు, జవాన్లు కలిసి ఉగ్రవాద శిబిరం గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు. (Terrorist arrested today)
నిఘా వర్గాల సమాచారం అందుకొని పుల్వామా పోలీసులు, ఆర్మీకి చెందిన 55 ఆర్ఆర్ బృందం.. సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు తలదాచుకునే శిబిరాన్ని బలగాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీన్ని తమ కోసం నిర్మించాలని లష్కరే తొయిబా కమాండర్ రియాజ్ సతర్గండ్.. తన అనుచరులకు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
తనిఖీ చేసిన సమయంలో అందులో ఉగ్రవాదులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సైతం లభించలేదని చెప్పారు. ఉగ్రవాద శిబిరం ఉన్న ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భాజపాలోకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్?