ఇంటిని చక్కబెట్టడమే కాకుండా, అన్ని రంగాల్లోనూ మగువలు సత్తా చాటుతున్నారు. ఇంటిల్లిపాదినీ ఆనందంగా ఉంచడమే తమ కర్తవ్యంగా భావిస్తారు. అయితే రుతుస్రావం రోజుల్లో వారు పడే వేదన అంతా ఇంతా కాదు. తీవ్రమైన నొప్పితో శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగిపోతారు. దురదృష్టవశాత్తు రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికీ కొంతమందికి సరైన అవగాహన లేదు. శానిటరీ నాప్కిన్స్ ఉపయోగంపై ప్రచారాలు కల్పించినా.. చాలా మంది గ్రామీణ మహిళలకు ఇవి ఇంకా ఆమడ దూరంలోనే ఉంటున్నాయి.
90 మంది కలిసి...
ఈ నేపథ్యంలోనే ఒడిశా కలహండిలోని భువనేశ్వర్ బెహెరా యూత్ ఆర్గనైజేషన్ మహిళలు విస్తృత ప్రచారం కల్పించేందుకు నడుం కట్టారు. ఈ బాధలను గుర్తెరిగిన 90 మంది మహిళలు, యువ విద్యార్థినులు శానిటరీ నాప్కిన్స్పై అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛత ఆవశ్యకతను వివరిస్తున్నారు. అంతే కాకుండా శానిటరీ ప్యాడ్ల తయారీ శిక్షణ అందించి మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా కృషి చేస్తున్నారు.
"చాలా తక్కువ మంది మహిళలు ఈ న్యాప్కిన్లను స్వీకరిస్తున్నారు. కలహండి ప్రజలకు వీటి అవసరాన్ని తెలియజేసేందుకు మేము కూడా ఈ న్యాప్కిన్లను ఉపయోగిస్తున్నాం."
-సంజుక్త బాఘ్, శిక్షకురాలు
జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని 62 శాతం మంది మహిళలు రుతుస్రావం సమయంలో సరైన పరిశుభ్రత పాటించడం లేదు. అంతేకాకుండా శానిటరీ న్యాప్కిన్ల గురించి అవగాహన లేకపోవడం వల్ల 52 శాతం మంది బాలికలు తమ విద్యాభ్యాసానికి స్వస్తి పలుకుతున్నారు.
"సంవత్సరం నుంచి మేం ఈ పని చేస్తున్నాం. రుతుస్రావం సమయంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే తీవ్ర మనోవేదనకు గురవుతారని మేం అందరికీ చెప్పాలనుకుంటున్నాం. నిర్లక్ష్యంగా ఉండకుండా అవగాహన కల్పిస్తున్నాం. వీటిని ఉపయోగించడం వల్ల పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లొచ్చు."
-పద్మావతి పటేల్, విద్యార్థిని
ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్న భువనేశ్వర్ బెహెరా యూత్ ఆర్గనైజేషన్.. మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పరిశుభ్రత ఆవశ్యకత గురించి వివరించడమే కాకుండా.. జీవనోపాధి కల్పిస్తోంది. వీరి కృషి ఫలితంగా సంస్థలోని సభ్యులు తయారు చేసిన శానిటరీ న్యాప్కిన్లు ఒడిశాలోనే కాకుండా కేరళలోని పలు ప్రాంతాలకూ సరఫరా అవుతున్నాయి.
"మేం తయారు చేస్తున్న బయోడీగ్రేడబుల్ ప్యాడ్లన్నీ కేరళకు ఎగుమతి చేస్తున్నాం. వస్తువులను కొని ఉత్పత్తులను అమ్ముతున్నాం. మహిళలు స్వయం సమృద్ధి సాధించే విధంగా వారికి శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తయిన తర్వాత ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో వారు విక్రయించుకోవచ్చు."
-అవినాశ్ ముత్, భువనేశ్వర్ బెహెరా యూత్ ఆర్గనైజేషన్ కార్యదర్శి
తొలుత కొంతవరకు ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఈ సంస్థ క్రమంగా తమ లక్ష్యాన్ని సాధించింది. గ్రామీణ మహిళలు, యువతులు పరిశుభ్రత అవసరాన్ని గుర్తించారు. శానిటరీ న్యాప్కిన్ల వాడకాన్ని స్వాగతించారు. ఈ సంస్థ పనితీరును చూసి నాబార్డు సైతం సంతృప్తి వ్యక్తం చేసింది. వీరికి సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలను ఇతర జిల్లాలకూ విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.
ఇదీ చదవండి- అంతర్జాతీయ స్థాయికి 'పలాశ్' రుచులు