కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మందిలో శ్వాసకోశ సమస్యలు పెరిగాయి. ఈ తరుణంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత వైద్యరంగానికి సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అస్తమా, గుండెపోటు సమస్యలున్న వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి కేరళలోని ఓ మెడికల్ షాపు యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది. ఎక్కడికైనా తీసుకెళ్లేలా, చేతిలో ఇమిడేలా ఆక్సిజన్ బాటిళ్లను తయారు చేసింది.
ఆక్సిజన్ 'స్ప్రే'
ఇంట్లో పనిచేయడం, మెట్లెక్కడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా అస్తమా, గుండెపోటు సమస్యలు ఎదుర్కొంటున్నవారికి శ్వాసతీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. అయితే.. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు తిరువనంతపురం పట్టొమ్లోని 'ఆర్టీఎఫ్' మెడికల్ షాపు యాజమాన్యం ఆక్సిజన్ బాటిళ్లను తయారు చేస్తోంది.
స్ప్రే బాటిళ్ల మాదిరిగా ఉండే ఈ ఆక్సిజన్ బాటిళ్లను తయారు చేసేందుకు ఇటాలియన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది ఆర్టీఎఫ్. చెన్నై కేంద్రంగా ఈ బాటిళ్లను తయారు చేయించడం విశేషం.
2 సంవత్సరాలు ఉపయోగించేలా..
150 సార్లు శ్వాసతీసుకునేలా ఆరు లీటర్ల ఆక్సిజన్‌ను ఒక్క బాటిల్లో అమర్చారు. రెండేళ్లపాటు వినియోగించేలా దీన్ని తయారు చేశారు. ఆన్లైన్లో రూ. 600 నుంచి రూ.650 వరకూ విక్రయిస్తున్నా మెడికల్ షాపులో ఒక్కో బాటిల్‌ను రూ. 500కే అందిస్తున్నారు. కేవలం 250 గ్రాముల బరువుండే ఈ బాటిల్‌ను కొనేందుకు చాలా మంది మెడికల్ షాపు వద్ద బారులు కడుతున్నారు.
50 ఏళ్లు పైబడిన వారు ఎక్కువగా ఈ బాటిళ్లను కొనేందుకు వస్తున్నారని మెడికల్ షాపు యాజమాన్యం చెబుతోంది. నెలకు దాదాపు 60 బాటిళ్లు విక్రయిస్తున్నట్లు పేర్కొంది.