సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందన సందేశాలు పంపిన వారికి జస్టిస్ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలు నిర్వర్తించడంలో అందరి సహకారం ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమక్షంలో శనివారం సీజేఐగా ప్రమాణస్వీకారం చేశారు జస్టిస్ రమణ. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖులు, న్యాయ నిపుణులు, అధికారులు, ముఖ్యమంత్రులు జస్టిస్ రమణకు అభినందన సందేశాలు పంపించారు.
"తన చిన్ననాటి స్నేహితుల నుంచి, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన అభినందన సందేశాల పట్ల సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. తన విధులు నిర్వర్తించడంలో అన్ని పక్షాల నుంచి సహకారం పొందుతానని ఆశిస్తున్నట్లు తెలిపారు."
-సీజేఐ కార్యాలయం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు జస్టిస్ రమణ. 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా ఆయన కీర్తి గడించారు. 16 నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
జస్టిస్ మోహన్ మృతిపై దిగ్భ్రాంతి
మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ మృతి పట్ల సీజేఐ విచారం వ్యక్తం చేశారు. జస్టిస్ మోహన్‌ను విలువైన సహోద్యోగిగా అభివర్ణించారు. 'ఆయన త్వరగా కోలుకొని సుప్రీంకోర్టుకు వస్తారని ఆశించాను. కానీ హఠాత్తుగా వచ్చిన ఆయన మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ విలువైన సహోద్యోగిని కోల్పోయాను' అని జస్టిస్ రమణ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఆయనతో పనిచేసిన గత నాలుగేళ్లలో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
జస్టిస్ మోహన్ కుమారుడితో మాట్లాడిన జస్టిస్ రమణ.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి- సుప్రీం కోర్టు పనితీరుపై సీజేఐ సమీక్ష