దేశవ్యాప్తంగా రాష్ట్రాల వద్ద కోటికిపైగా టీకా డోసులు నిల్వ ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో మరో 57,70,000 డోసులు పంపుతున్నట్లు పేర్కొంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరత ఉన్నట్లు పలు రాష్ట్రాలు తెలిపాయి. ఈ మేరకు టీకాల వివరాలను వెల్లడించింది కేంద్రం.
ఇప్పటివరకూ 15 కోట్ల 95 లక్షలా 96 వేల 140 వ్యాక్సిన్‌లను రాష్ట్రాలకు ఉచితంగా అందించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో వృథా అయిన డోసులు కలుపుకొని మొత్తం 14 కోట్లా 89 లక్షలా 76 వేల 248 డోసులను రాష్ట్రాలు వినియోగించగా.. మిగిలిన కోటీ 6 లక్షలా 19 వేల 892 డోసులు రాష్ట్రాల దగ్గర ఉన్నాయని తెలిపింది.
మహారాష్ట్రలో కొవిడ్ టీకాలు అడుగంటాయంటూ అధికారులు, రాజకీయనేతలు ప్రకటనలు చేస్తున్న వేళ ఆ విషయంపైనా కేంద్రం స్పష్టతనిచ్చింది. మహారాష్ట్రకు ఏప్రిల్ 28 ఉదయం 8 గంటల వరకు కోటీ 58 లక్షలా 62 వేల 470 డోసులు ఇచ్చామని వాటిలో వృథాతో పాటు వినియోగించినవి కోటీ 53 లక్షలా 56 వేల 151 కాగా ఇంకా 5 లక్షలకు పైగా డోసులు ఆ రాష్ట్రంలో మిగిలే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఇతర రాష్ట్రాల దగ్గర ఉన్న టీకా డోసుల వివరాలు కూడా కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: కరోనా ప్రళయం- దేశంలో 2 లక్షలు దాటిన మరణాలు