టీకాల కొరతపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం నేడు మరోసారి స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17.49 కోట్ల డోసులను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. ఇందులో 16కోట్లకు పైగా డోసులను ఉపయోగించగా.. ఇంకా 84లక్షలకు పైగా టీకాలు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
"కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 17,49,57,770 టీకా డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. ఇందులో శనివారం ఉదయం 8 గంటల నాటికి 16,65,49,583 డోసులను(వృథాతో కలిపి) వినియోగించాయి. ఇంకా 84,08,187 డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయి. రానున్న మూడు రోజుల్లో మరో 53,25,000 వ్యాక్సిన్లను పంపించనున్నాం" అని హోంశాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వద్ద 9.88లక్షల డోసులు అందుబాటులో ఉండగా.. తమిళనాడులో 7.28లక్షలు, మధ్యప్రదేశ్‌లో 5.56లక్షలు, మహారాష్ట్రలో 4.52లక్షల డోసులు ఉన్నట్లు పేర్కొంది.
లక్షద్వీప్‌లో అధిక వృథా
కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో అధిక సంఖ్యలో టీకాలు నిరుపయోగమైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అక్కడ 22.74 శాతం డోసులు వృథా అయినట్లు తెలిపింది. ఆ తర్వాత హరియాణాలో 6.65శాతం, అస్సాంలో 6.07శాతం, రాజస్థాన్‌లో 5.50శాతం నిరుపయోగమైనట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: త్వరలో అందుబాటులోకి జైడస్ టీకా!