ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరిన్ని ఎక్కువ వ్యాక్సిన్లు రాబోతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అయితే టీకాలు వచ్చినంతమాత్రానా.. వైరస్ ముప్పు తొలగిపోయినట్లు కాదని, ప్రజలంతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్‌మెంట్ హెల్త్‌లో నూతన క్యాంపస్‌ను హర్షవర్ధన్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కరోనాపై పోరులో భాగంగా భారత్ రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు 71దేశాలకు టీకాలను సరఫరా చేసింది. అవేమీ చిన్న దేశాలు కూడా కాదు. కెనడా, బ్రెజిల్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు కూడా మన వ్యాక్సిన్లను వినియోగిస్తున్నాయి' అని తెలిపారు. త్వరలోనే అరడజను పైగా టీకాలు దేశంలో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
భారత్‌ను 'విశ్వగురు'గా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని హర్షవర్ధన్ ఈ సందర్భంగా తెలిపారు. వ్యాక్సిన్లపై రాజకీయాలు చేయడం సరికాదని, దీనిమంతా మనమంతా కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 'మన శాస్త్రవేత్తల కృషి అనిర్వచనీయం. వారి శ్రమ వల్లే మనం నేడు వ్యాక్సిన్ల ఘనత సాధించాం. 2020 అంటే కొవిడ్ 19తో పాటు సైన్స్, శాస్త్రవేత్తల సంవత్సరంగా మనకెప్పటికీ గుర్తుండిపోతుంది'అని కేంద్రమంత్రి వివరించారు. ఈ సందర్భంగా దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతిపై స్పందించిన ఆయన.. నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్లే కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని అన్నారు. వ్యాక్సిన్లు వచ్చాయంటే ముప్పు తొలగిపోయినట్లు కాదని, ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.