దేశంలో కరోనా విజృంభిస్తున్నా.. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. రెండోషాహీ స్నాన్ సందర్భంగా సాయంత్రం 6 గంటల వరకు 35 లక్షల మందికి పేగా భక్తులు పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం వేలాది మంది సాధువులు, నాగాలు పుణ్నస్నానాలు చేశారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా వారిపై పూలవర్షం కురిపించింది. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు, నాగాలు భారీ ఊరేగింపుగా వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సాధువుల రాకతో హర్ కి పైరీ ఘాట్ హరహర మహాదేవ్ నామస్మరణతో మారుమోగింది.
నేపాల్ మాజీ రాజు పుణ్య స్నానం
అత్యంత పవిత్రంగా భావించే హర్ కి పైరీ ఘాట్ ను ఉదయం 7 గంటల నుంచి అఖాడాలకు కేటాయించగా సాధారణ భక్తులు ఇతర ఘాట్లలో పుణ్యస్నానాలు చేశారు. మొతం 13 అఖాడాలు ఉండగా నిరంజనీ అఖాడాకు చెందిన సాధువులు మొదట షాహీస్నాన్ చేశారు. తొలిసారి హరిద్వార్‌ను సందర్శించిన నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర బీర్ బిక్రం షా కూడా గంగానదిలో స్నానం ఆచరించారు. హరిద్వార్ నుంచి దేవ్ ప్రయాగ్ వరకూ షాహీస్నాన్ సజావుగా సాగుతున్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు.
తొలి షాహీ స్నాన్ గతనెల 11న మహాశివరాత్రి సందర్భంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కుంభమేళాను నెల రోజులకు కుదించారు. 600 హెక్టార్ల పొడవున సాగుతున్న కుంభమేళాకు 20 వేల మంది పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : 15 నుంచి అమర్నాథ్ యాత్రకు పేర్ల నమోదు