దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి జల విలయం బీభత్సం సృష్టించింది. జోషిమఠ్ వద్ద నందాదేవీ హిమానీనదం కట్టలు తెంచుకోవడం వల్ల చమోలీ జిల్లా రేనీ తపోవన్ వద్ద రిషి గంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రిషిగంగా జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా నది సంగమం వద్ద ఉన్న ఎన్టీపీసీకి చెందిన మరో జల విద్యుత్ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది. వరదల ధాటికి రెండు ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న170 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఏడుగురు మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 16 మందిని సహాయక సిబ్బంది కాపాడినట్లు స్పష్టం చేసింది.
ముమ్మరంగా సహాయకచర్యలు..
వరదల్లో కొట్టుకుపోయిన కార్మికుల కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఇండో-టిబెటన్ సరిహద్దు దళం, స్థానిక పోలీసులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రెండు ఎమ్ఐ-17 యుద్ధ విమానాలు సహా ఓ ధ్రువ్ పోరాట హెలికాఫ్టర్‌ను దెహ్రాదూన్ వద్ద సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. సహాయ చర్యల కోసం హెలికాఫ్టర్లు, బలగాలను సైన్యం రంగంలోకి దింపింది. రిషికేశ్‌లోని సైనిక స్థావరాన్ని కేంద్రంగా చేసుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్తో కలిసి పనిచేస్తోంది. 600 మంది సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఒక సొరంగంలో చిక్కుకున్న 16 మంది కార్మికులను ఐటీబీపీ బృందం కాపాడింది.
సొరంగంలోంచి బయటపడిన కొంత మంది కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లడం వల్ల వారికి ఆక్సిజన్ అందించారు. మరో టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాలు..
వరద ధాటికి నదీ తీరంలో ఉన్న పలు గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన ఉత్తరాఖండ్ సర్కార్అ నేక గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఉత్తరాఖండ్‌లోని పౌరి, తెహ్రీ, రుద్ర ప్రయాగ్, హరిద్వార్, దెహ్రాదూన్ జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌ను జారీ చేసినట్లు పేర్కొన్నారు. విష్ణుప్రయాగ్, జోషిమఠ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ ప్రాంతాల ప్రజలు నదీ తీరానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. మరోవైపు గంగానదీ తీర ప్రాంత రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.
మంచుచరియలు విరిగిపడటం వల్ల నదిలో నీటిప్రవాహం పెరిగి ప్రాజెక్టులు ధ్వంసమైనట్లు జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) వెల్లడించింది. ఆదివారం సాయంత్రం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన ఎన్సీఎమ్సీ.. పరిస్థితిని సమీక్షించింది. పెరిగిన నీటిమట్టాన్ని నియంత్రణలో ఉంచడం వల్ల దిగువ ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది.
- ఇదీ చూడండి: ఎంపీలో దారుణం- ఐదేళ్ల బాలికపై అత్యాచారం