Ex-Bureaucrats Letter to Modi: విద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలకాలంటూ 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో పేట్రేగుతున్న విద్వేషపూరిత రాజకీయాలకు ముస్లింలు, ఇతర మైనార్టీలే కాకుండా రాజ్యాంగం కూడా బలవుతోందని పేర్కొన్నారు. లేఖలో సంతకాలు చేసిన వారిలో దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మేనన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన టీకేఏ నాయర్ ఉన్నారు.
"ఇలా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మా ఉద్దేశం కాదు. కానీ రాజ్యాంగ విలువలు దెబ్బతినేలా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే మమ్మల్ని లేఖ రాసేందుకు ప్రేరేపించాయి. ఉత్తర్ప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్, కర్ణాటక, హరియాణా, గుజరాత్ ఇలా భాజపా పాలిత ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా మీరు మౌనం వహించడం సరికాదు. మీరు ఇచ్చిన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ హామీపైన నమ్మకం ఉంచి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం."
- లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్గా పేర్కొంటున్న ఈ ఏడాదిలో.. పక్షపాత వైఖరికి అవకాశం ఇవ్వకుండా మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు సృష్టిస్తున్న విద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నాం" అని మాజీ సివిల్ సర్వెంట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్కు పీకే ఝలక్!