వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి యథాతథ స్థితి నెలకొల్పడమే తమ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దు పరిణామాలపై లోక్సభలో మాట్లాడిన ఆయన.. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇరుపక్షాలు సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. చైనా చేపట్టిన ఏకపక్ష చర్యలను భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొన్నాయని స్పష్టం చేశారు.
"సైన్యం చూపిన తెగువ వల్లే.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ చైనాపై పైచేయి సాధించగలిగాం. దేశ ప్రాదేశిక సమగ్రత తమ చేతుల్లో సురక్షితంగా ఉందని సైన్యం మరోసారి రుజువు చేసింది. సైన్యం పట్టుదల, సంకల్పం నిశ్చలంగా ఉంది."
-రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
చైనాతో కుదిరిన అంగీకారం ప్రకారం దశలవారిగా సమన్వయంతో బలగాల ఉపసంహరణ చేపట్టనున్నట్లు తెలిపారు రాజ్నాథ్. ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవించి వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క ఇంచు భూమి కూడా చైనాకు దక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే చర్చలు ఇంకా ముగియలేదని, పలు అంశాలపై ఏకాభిప్రాయం లేదని చెప్పారు.
చైనా తన సైనికులను పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్ 8 వద్ద ఉంచుతుందని, భారత్ తన బలగాలను ఫింగర్ 3 సమీపంలో ఉన్న శాశ్వత బేస్ వద్ద మోహరిస్తుందని చెప్పారు. దక్షిణ తీరంలోనూ ఇలాంటి మార్పులు ఉంటాయని వివరించారు.