Workers attacked police: క్రిస్మస్ వేడుకల్లో చెలరేగిన ఘర్షణను నియంత్రించేందుకు వచ్చిన పోలీసులపై 300 మంది వలస కార్మికులు దాడి చేశారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన కేరళ, ఎర్నాకులం జిల్లాలోని కిళక్కంబలమ్లో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో కున్నతునాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ షాజన్ సహా మొత్తం ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొల్లెంచెర్రి వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నగరంలోని కైటెక్స్ సంస్థలో పని చేస్తున్న వలస కార్మికులు(ఇతర రాష్ట్రాలకు చెందిన వారు) ఉండే ప్రాంతంలో శనివారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పార్టీలో భాగంగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఘటానాస్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన సుమారు 300 మంది కార్మికులు పోలీసులపై దాడి చేశారు. దాంతో పోలీసులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తింది.
ఆ తర్వాత.. అలువా రూరల్ ఎస్పీ కార్తిక్ నేతృత్వంలో 500 మంది పోలీసులు ఘటానాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 150 మంది కార్మికులను కస్టడీలోకి తీసుకున్నారు. ఘర్షణ తలెత్తిన కిళక్కంబలమ్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. మృతదేహాన్ని డ్రమ్ములో దాచి..