Oreva Morbi Bridge : గోడ గడియారాలు, సీఎఫ్‌ఎల్ బల్బులు, విద్యుత్ బైకులు తయారు చేసుకునే సంస్థ ఒరేవాకు .. 1887లో నిర్మించిన మోర్బీ వంతెన, మరమ్మతు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒరేవా గ్రూప్‌ను అయిదు దశాబ్దాల క్రితం ఓధవ్‌జీ రాఘవ్‌జీ పటేల్ స్థాపించారు. ప్రారంభంలో ఈ సంస్థ ప్రఖ్యాత అజంతా, ఆర్పాట్ గోడ గడియారాలను తయారు చేసేది. అక్టోబరులో 88వ ఏట ఆయన మరణించారు. 1971 వరకూ ఆయన సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేసి 45వ ఏట ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మారారు. ఈ సంస్థ ఏటా రూ.800 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తోంది. ప్రస్తుతం గృహోపకరణాలు, విద్యుత్ పరికరాలు, కరెంటు బల్బులు, కాలిక్యులేటర్లు, సిరామిక్ ఉత్పత్తులు, ఈ-బైక్‌లను ఉత్పత్తిలోకి దింపింది.
6000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థ తన వెబ్‌సైట్‌లో తాము నిర్మాణరంగంలో ఉన్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. మచ్చు నదిపై 'జూల్టాపుల్'గా ప్రఖ్యాతి గాంచిన తీగల వంతెనను మరమ్మతుల కోసం ఏడు నెలలుగా మూసేశారు. మార్చిలో దీని మరమ్మతులు, నిర్వహణ బాధ్యత కాంట్రాక్టును ఒరేవా గ్రూపు దక్కించుకుంది. మరమ్మతుల అనంతరం గుజరాత్ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబరు 26న మోర్బీ బ్రిడ్జ్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే వంతెనకు ఫిట్‌నెస్ ధ్రువపత్రం అందకుండానే ఆరంభించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఈ వంతెన మరమ్మతులను నిపుణులతో చేయించామని, నైపుణ్య సంస్థలు నిర్ధారించిన ప్రమాణాలతో కూడిన సామగ్రిని వినియోగించామని, ఇందుకోసం మొత్తం రూ.రెండు కోట్లు ఖర్చు చేశామని ఒరేవా సంస్థ అక్టోబరులో ప్రకటించింది.
ఇవీ చదవండి: 71 ఏళ్ల వయసులోను 'తగ్గేదేలే'.. డిప్లొమాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన వృద్ధుడు
పాదయాత్ర చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు దుర్మరణం