Ordnance factory in MP: భారత వైమానిక దళం అమ్ములపొదిలోకి 500కిలోల బాంబు చేరింది. ఈ బాంబు చేరికతో వాయుసేన బలం మరింత పెరగనుందని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్, జబల్‌పుర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ బాంబును అభివృద్ధి చేశారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా మొత్తం 48 బాంబులను వాయుసేనకు అందించినట్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎస్కే సిన్హా తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ బాంబును రూపొందించటంలో వివిధ రక్షణ సంస్థలకు చెందిన నిపుణులు నిమగ్నమయ్యారని ఎస్కే సిన్హా తెలిపారు.
1943లో స్థాపించిన ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రధాన మందుగుండు ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ సామగ్రిని అందించింది. స్వాతంత్య్రం తర్వాత.. 1962 చైనా యుద్ధం, 1965, 1971లో జరిగిన పాకిస్థాన్ యుద్ధాల సమయంలో సాయుధ దళాలకు వివిధ రకాల మందుగుండు సామగ్రిని సరఫరా చేయడంలో ఈ కర్మాగారం కీలక పాత్ర పోషించింది.
ఇదీ చదవండి: ఫోన్లోనే విడాకులు.. భార్యకు ఒక్క రూపాయి పరిహారం.. పంచాయతీ వింత తీర్పు