2000 Notes Withdrawn In India : చలామణిలో ఉన్న 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత‌్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నాయి. మోదీ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు మండిపడ్డాయి. దీన్ని డీమానిటైజేషన్ 2.0గా అభివర్ణించాయి. ఈ చర్యను కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఖండించాయి.
2వేల నోట్లను ఉపసంహరించుకుంటూ ఆర్‌బీఐ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ ద్వారా కేంద్రంపై విమర్శలు చేశారు. మొదటి డీమానిటైజేషన్‌తో ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని, అసంఘటిత రంగంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడినట్లు ఆరోపించారు. ఇప్పుడు డీమానిటైజేషన్ 2.0 ద్వారా తమ తప్పుడు నిర్ణయాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమా అని ఖర్గే ప్రశ్నించారు. 2వేల నోట్ల రద్దుపై విచారణ జరపాలని ట్వీట్ చేశారు. చలామణిలో ఉన్న నగదు పరిమాణం అవినీతితో ముడిపడి ఉంటుందని ప్రధాని మోదీ అప్పట్లో చెప్పారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ గుర్తుచేశారు. 2016లో 17 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో ఉండగా.. 2022నాటికి 30లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అంటే అవినీతి ఆస్థాయిలో పెరిగిందా అని సిబల్ సూటిగా ప్రశ్నించారు.
2000 Notes Withdrawn Oppostion Parties : తమ నోట్లు ఎప్పుడు టాయిలెట్ పేపర్లుగా మారిపోతాయోనన్న భయం.. ఏ దేశప్రజలనూ ఇంతగా వేధించలేదని టీఎంసీ నాయకురాలు మెహువా మొయిత్రా అన్నారు. భాజపా, నరేంద్రమోదీ ఎంత ప్రయత్నించినా ప్రజల దృష్టిని మరల్చలేరన్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రధాని మోదీకి ప్రశ్నలవర్షం కురిపించారు. 70 కోట్ల మంది ప్రజలకు స్మార్ట్‌ఫోన్లు లేనప్పుడు డిజిటల్ చెల్లింపులు ఎలా సాధ్యమని నిలదీశారు. 5 వందల నోట్లు కూడా రద్దు చేస్తారా అంటూ ఒవైసీ ఎద్దేవా చేశారు.
2వేల నోట్లను ఉపసంహరిస్తూ RBI తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతుండగా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ మాత్రం సమర్థించారు. ఈ నిర్ణయం ఆర్థికవ్యవస్థకు ప్రయోజనకరమే అని అన్నారు. ఎందుకంటే 2వేల నోట్ల ఉపసంహరణతో నగదు దాచుకోవటం తగ్గుతుందని తెలిపారు. 3.6లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉండగా.. అందులో కొంతభాగం ఎక్కడుందో తెలియదన్నారు. RBI ఉపసంహరణ నిర్ణయంతో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయన్నారు. దేశంలో 80శాతం మంది ప్రజలు వద్ద.. చలామణీలో ఉన్న 2వేల నోట్లలో కేవలం 20శాతమే ఉన్నాయని చెప్పారు. మిగతా 20 శాతం మంది వద్ద.. 80శాతం 2 వేల నోట్లు ఉన్నట్లు చెప్పారు. వాటిని వెలికి తీసేందుకు RBI నిర్ణయం దోహదపడుతుందని కృష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు.