ETV Bharat / bharat

శాస్త్రీయ స్ఫూర్తిని ముంచుతున్న మూఢనమ్మకాలు - శాస్త్రీయ స్ఫూర్తి

విజ్ఞానం, సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తోంది. మారు మూల గ్రామాల్లో కూడా సాంకేతికత వినియోగం పెరిగింది. కానీ అందరిలో శాస్త్రీయ స్ఫూర్తి లోపించింది. సాంకేతికతను ఇంతగా వాడేవారు దాని వెనకున్న శాస్త్రజ్ఞానాన్ని తమ ఆలోచనలకు మూలంగా చేసుకోవడం లేదు. ఒకవైపు శాస్త్రంతో, మరోవైపు అశాస్త్రీయ ఆలోచనలతో సహజీవనం చేసే వైరుధ్య ధోరణి పెరిగింది.

buddha, superstitions
లోపించిన శాస్త్రీయ స్ఫూర్తి
author img

By

Published : Feb 22, 2021, 8:11 AM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యాధికులైన పురుషోత్తమనాయుడు, పద్మజ దంపతులు క్షుద్రపూజలు చేసి తమ పిల్లలు అలేఖ్య (27), సాయిదివ్య(22)లను ఇటీవల హతమార్చారు. తరవాత కుమరంభీమ్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండలంలో నాందేవ్‌ తన భార్యను మంత్రాలతో అనారోగ్యం పాలు చేశాడని అనుమానించి సోదరుడిని కర్రలతో కొట్టి చంపేశారు. టీవీలో ఒక బాబా ప్రకటన చూసి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అతన్ని ఫోన్‌ ద్వారా సంప్రతించారు. పూజలతో కాపురం చక్కబెడతాడని నాలుగు లక్షల రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా పంపారు. చివరికి మోసం అర్థమై పోలీసులను ఆశ్రయించారు.

దేశంలో శాస్త్రీయ స్ఫూర్తికి స్థానం తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాలతో జరుగుతున్న వరస సంఘటనలే దీనికి తార్కాణం. కర్ణాటక, మహారాష్ట్ర వంటి చోట్లా ఇలాంటివి ఎక్కువే. ఒకవైపు నగరాల్లోనే కాదు, మారుమూలలా ప్రజలు ఆధునిక ఉపకరణాలను వాడుతున్నారు. సెల్‌ఫోన్లు, కేబుల్‌ కనెక్షన్‌ లేని ఇళ్లు అరుదు. దేశవిదేశాల్లోని తమ వాళ్లతో రోజూ దృశ్యమాధ్యమం ద్వారా మాట్లాడటం గ్రామాల్లోనూ సాధారణం. సాంకేతికతను ఇంతగా వాడేవారు దాని వెనకున్న శాస్త్రజ్ఞానాన్ని తమ ఆలోచనలకు మూలంగా చేసుకోవడం లేదు. ఒకవైపు శాస్త్రంతో, మరోవైపు అశాస్త్రీయ ఆలోచనలతో సహజీవనం చేసే వైరుధ్య ధోరణి పెరిగింది.

మానవ వికాసాన్ని అడ్డుకున్న మౌఢ్యం

మానవ పురోభివృద్ధిలో కీలకం కొత్త విషయాలను కనుక్కోవడం. దీనికి తొలి నుంచి అడ్డుగా ఉన్నది మౌఢ్యం. పరిశీలన, పరిశోధనల వల్ల సంపాదించిన జ్ఞానం సత్యమని అంగీకరించడం, అలాంటి జ్ఞానానికి పొసగని అంశాలను ప్రశ్నించడమే శాస్త్రీయ స్ఫూర్తి. సమకాలీన జ్ఞానాన్ని తిరిగి పరిశీలించడం, కొత్తగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలను అంగీకరించడం ఇందులో భాగం. మూఢనమ్మకం దీనికి విరుద్ధం. ఏవో మానవాతీత శక్తులు ఉన్నాయని, మన జీవితాల్లో, చుట్టూ ఉన్న ప్రపంచంలో పరిణామాలు ఆ శక్తుల ఆజ్ఞలతోనే జరుగుతున్నాయనేది ఆ నమ్మకం. ఆది నుంచీ ఈ ధోరణుల మధ్య ఘర్షణ ఉంది. ఇందులో విజ్ఞాన శాస్త్రం గెలిచినప్పుడు నాగరికత ముందుకు సాగింది. మూఢత్వం గెలిచినప్పుడు అది వెనకపడింది. నాగరికత పూర్వదశలోనూ మానవుడి అవగాహనలో విజ్ఞాన శాస్త్రం ఉంది, మౌఢ్యమూ ఉంది. ఏ కాయలు తినవచ్చో, ఏవి తినకూడదో అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. ఆహారాన్ని వెతుక్కునే స్థాయి నుంచి పండించడం నేర్చాడు. ఇదంతా శాస్త్రీయ జ్ఞానమే. తన జ్ఞానస్థాయికి అంతుపట్టని విషయాల్లో మౌఢ్యాన్ని ఆశ్రయించాడు.

క్రీస్తుపూర్వమే బుద్ధుడు ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనలను పెంచేందుకు కృషి చేశాడు. తదుపరి కాలంలో ఆయన బోధనలకూ మత విశ్వాసాల కలబోత జరిగింది. ప్రాచీనకాలంలో వైద్యం, గణితం వంటి రంగాల్లో భారత్‌ చెప్పుకోదగ్గ విజ్ఞానాన్ని సాధించింది. అయితే మూఢవిశ్వాసాలు, వాటిని ప్రజల్లో నరనరానా ఇంకేలా చేసిన మత సిద్ధాంతాలు నాగరికతను అడ్డుకున్నాయి. క్రీస్తుశకం పదిహేను వందల ఏళ్ల దాకా ప్రపంచమంతా దారుణ పరిస్థితులు ఉండేవి. ఆ తరవాత ఐరోపాలో వచ్చిన ‘పునరుజ్జీవనం’తో విజ్ఞాన శాస్త్రం బాగా ముందడుగు వేసింది. అప్పటిదాకా భూమి స్థిరంగానే ఉంటుందని, సూర్యుడు దానిచుట్టూ తిరుగుతాడని ప్రపంచం నమ్మేది.

ఎవరో నమ్మమని చెప్పినందువల్ల అది సంప్రదాయం అయినందువల్ల లేదా నీవు దాన్ని ఊహించుకున్నందువల్ల దేనినీ నమ్మకు. గురువు మీద గౌరవం ఉన్నంత మాత్రాన గురువు చెప్పిందల్లా నమ్మకు. తగిన రీతిలో పరీక్షించి, విశ్లేషించిన తరవాత అది మంచికి తోడ్పడుతుందనుకుంటే అది సకల జీవుల సంక్షేమానికి ఉపయోగపడుతుందనుకుంటే ఆ సిద్ధాంతాన్ని విశ్వసించు. దాన్ని మార్గదర్శకంగా ఆమోదించు.

-బుద్ధుడు

విజ్ఞాన రంగంలో ఒడుదొడుకులు

భూమే సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నదని కనుక్కున్నది కోపర్నికస్‌ (1473-1543). తన పరిశోధనలు, మతాలు చెప్పే అనేక అంశాలను సవాలు చేసేలా ఉండటం వల్ల ఆయన భయపడి చాన్నాళ్లు వాటిని బయటపెట్టలేదు. అవి వెలుగు చూశాక కలకలం రేగింది. కోపర్నికస్‌ సిద్ధాంతాలను ప్రచారంలో పెట్టవద్దని మతపెద్దలు ఆంక్షలు విధించారు. ఆ తరవాత గ్రహాలకు సంబంధించి విలువైన జ్ఞానాన్ని అందించిన శాస్త్రజ్ఞుడు గెలీలియో (1564-1642). ఆయన 1609లో టెలిస్కోపును కనుగొన్నారు. అప్పటి వరకూ అందమైన గుండ్రటి గోళం అనుకున్న చంద్రుడిపై కొండలు, లోయలు ఉన్నాయని ఆయన పరిశోధనలతో తెెలిసింది. కోపర్నికస్‌ సిద్ధాంతం సత్యమని ఆయన చాటారు. ఇది ఆయన్ను తీవ్రకష్టాల్లోకి నెట్టింది. ఆయన 69 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఐరోపాలోని మత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆయనను ‘ధర్మద్రోహి’గా తీర్మానించి మరణశిక్షను విధించబోయింది. అప్పుడు గెలీలియో తన ప్రాణరక్షణ కోసం తన సిద్ధాంతాలు తప్పేనని ఒప్పుకోవాల్సివచ్చింది. దాంతో మత న్యాయస్థానం అతనిని ప్రాణాలతో వదిలి ఇంటికే పరిమితమై బతకమని ఆదేశించింది.

ఇలా విజ్ఞాన రంగంలో వచ్చిన విజయాలన్నింటి వెనకా పోరాటాలు ఉన్నాయి. మొదట ఆయా శాస్త్రజ్ఞులు తమ అంతరంగంతో పోరాడారు. ఎందుకంటే వారూ మూఢనమ్మకాలు ప్రగాఢంగా ఉన్న సమాజాల్లోనే పుట్టిపెరిగారు. ఇక మౌఢ్యం రాజ్యమేలుతున్న సమాజాలతోనూ పోరాడాల్సి వచ్చింది. మన వద్ద సామాజిక రంగంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినా, విజ్ఞానశాస్త్ర రంగంలో మత సంప్రదాయాలను ప్రతిఘటించి ఆవిష్కరణలు చేయడం వంటివి జరగలేదు. బాగా చదువుకున్నవారు కూడా అశాస్త్రీయంగా ఆలోచించడం ప్రపంచం అంతటా ఉన్నా మన పరిస్థితి మరింత అధ్వానంగా ఉండటానికి ఇదీ ఒక కారణం.

విజ్ఞాన శాస్త్ర బోధనలోనూ లోపం

మన దగ్గర విజ్ఞాన శాస్త్ర బోధన కూడా విద్యార్థులు జీవితంలోకి అన్వయించుకునే రీతిలో జరగదు. బుర్రల్లోకి సమాచారాన్ని ఎక్కించే తీరున బోధన ఉంటోంది. విజ్ఞాన శాస్త్రానికి విశ్లేషణ ప్రాణం. ఎందుకు, ఏ విధంగా అనే ప్రశ్నలకు అది సమాధానం చెబుతుంది. ఆ తార్కిక ధోరణినే విద్యార్థులు జీవితంలో అన్వయించుకుంటే వారిలో శాస్త్రీయ ఆలోచన పెరుగుతుంది. ఇక పూర్వీకులు చెప్పినది యథాతథంగా మనసులోకి ఎక్కించుకుని అనుసరించే సంప్రదాయం మనది. ప్రపంచంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణల వంటివి శతాబ్దాలనాటి మన శాస్త్రాల్లో, పురాణాల్లో ఉన్నాయని అనేకమంది విద్యావంతులే చెబుతుంటారు. తొలి ప్రధాని నెహ్రూ దేశంలో శాస్త్రీయ స్ఫూర్తిని పెంచాలని పదేపదే చెప్పేవారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సతీష్‌ ధావన్‌, పి.ఎం.భార్గవ వంటివారు ఈ దిశగా కృషి చేశారు.

మన రాజ్యాంగం ప్రకారం శాస్త్రీయ స్ఫూర్తిని కలిగి ఉండటం పౌరుడి బాధ్యత. నెహ్రూ తరవాత దీనిపై ఏ జాతీయ నేతా దృష్టిపెట్టలేదు. పైగా ప్రజల్లో పాతుకుపోయిన అశాస్త్రీయ ఆలోచనల ఆధారంగా రాజకీయాలు నడిపే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో దైవాంశ సంభూతులుగా ప్రచారం పొందే వ్యక్తులు రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. శాస్త్రీయ స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో వైఫల్యం వల్లే ప్రస్తుతం మన కళ్ల ముందు అనేక దారుణాలు జరుగుతున్నాయి. ఛాందసం రాజ్యమేలే స్థితి వస్తే దేశం తిరోగమిస్తుంది. ప్రజల్లో సృజన క్షీణిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి ఉండదు. ఇరాన్‌, పాకిస్థాన్‌లే ఇందుకు ఉదాహరణ. భారత్‌ నిజమైన ఆధునిక దేశంగా ఎదగాలంటే ప్రజల్లో శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించాలి!

-ఎన్ విశ్వప్రసాద్

ఇదీ చదవండి : నేడే పుదుచ్చేరిలో బలనిరూపణ.. ప్రభుత్వం గట్టెక్కేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.