Online rummy suicide: చెన్నై మణలి పుదునగర్‌లో ఆన్‌లైన్ రమ్మీలో బంగారం, నగదు కోల్పోయిన ఐటీ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. చెన్నై మణలి పుదునగర్‌లో చెందిన భాగ్యరాజ్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను ఆరేళ్ల క్రితం భవానిని (29) ప్రేమ వివాహం చేసుకున్నాడు. భవానీ ఐటీ సంస్థలో పనిచేస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి స్నానానికి వెళ్లిన భవాని బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు మణలి పుదునగర్‌లో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ రమ్మీకి బానిసైన భవాని తన కుటుంబసభ్యుల వద్ద ఆరు నెలల క్రితం రూ.మూడు లక్షలు తీసుకుంది. 20 సవర్ల బంగారు నగలు కూడా కుదువపెట్టి ఆన్‌లైన్ గేమ్‌లో నష్టపోయింది. ఈ వ్యవహారంపై ముందుగానే భర్త, తల్లిదండ్రులు మందలించినా ఆమె తీరు మారలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఇవీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్.. పాక్ ఉగ్రవాది తుఫేల్ హతం