మొబైల్ యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణాలు అందజేస్తూ మితిమీరిన వడ్డీలు వసూలు చేస్తున్న ఆన్‌లైన్ వేదికలను కట్టడి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతోనూ అధిక మొత్తాలను వినియోగదారుల నుంచి గుంజుతున్నారని తెలిపింది. ఈ పరిస్థితిని కొనసాగనివ్వరాదని చెబుతూ కేసు తదుపరి విచారణ జరిగే ఆగస్టు 27 నాటికి పరిష్కార మార్గంతో న్యాయస్థానానికి రావాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)లకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.ఎన్.పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల ధర్మాసనం మంగళవారం ఆదేశించింది.
నియంత్రించాలని కోరుతూ..
'అధిక వడ్డీల వసూలు వల్ల తలెత్తే ఇబ్బందులను గమనించాలి. ఈ అంశంపై నిపుణుల కమిటీ పరిశీలన అవసరం. కేంద్రం, అర్బీఐ ఈ సమస్యపై జాప్యం చేస్తే.. నిపుణుల కమిటీ సహాయంతో న్యాయస్థానమే ఉత్తర్వులు జారీ చేస్తుంది' అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ రుణ సంస్థలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనంలో మంగళవారం విచారణ కొనసాగింది. బకాయిలు చెల్లించడంలో జాప్యం జరిగితే రుణగ్రహీతలను తీవ్రంగా అవమానించడం, వేధించడం వంటివి చేస్తున్నారని తెలంగాణకు చెందిన కె.ధరణీధర్.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్ రుణ యాప్‌లు దేశంలో 300 పైగా ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. రుణమిచ్చే సమయంలోనే వడ్డీని, ప్రాసెసింగ్ రుసుమును మినహాయించుకుంటారని, మొత్తం రుణంలో ఇవి 35 శాతం నుంచి 45 శాతం వరకు ఉంటున్నాయని వివరించారు.
'ఉత్తమమైన పిటిషన్..'
ప్రజల సంక్షేమం గురించి దాఖలైన ఉత్తమమైన పిటిషన్‌గా ధర్మాసనం ప్రశంసించింది. న్యాయస్థానం ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ, స్టాండింగ్ కౌన్సెల్ అనురాగ్ అహ్లూవాలియా తెలిపారు. కొంత సమయం కావాలని కోరారు. ఆన్‌లైన్ రుణ వేదికలను నియంత్రించే అధికార పరిధి కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆర్బీఐ తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తెలిపారు.
ఇదీ చూడండి: పెద్దలకు మాత్రమే.. అస్సలు మిస్ కావద్దు
ఇదీ చూడండి: పెగాసస్‌పై నయా రాజకీయం- కాంగ్రెస్ దూరం!