Ongole land scandal: ఒంగోలు భూ కుంభకోణంపై వైకాపా ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.... తీవ్ర అసంతృప్తి తర్వాత ఎట్టకేలకు.. ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. భూకుంభకోణం పూర్తివివరాలతో రావాలని, ప్రకాశం జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌కు సీఎంవో పిలుపు నిచ్చింది. సీఎంవో ఆదేశాలతో జిల్లా ఎస్పీ మలికాగార్గ్ భూకుంభకోణం దస్త్రాలతో సీఎంవోకు బయల్దేరి వెళ్లారు. ఒంగోలు నగరంతో పాటు..మార్కాపురం పట్టణాల్లో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులతో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయి. బాధితుల ఫిర్యాదుతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం 20 రోజులుగా దర్యాప్తు చేస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమార్కుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నయి. వందల కోట్ల విలువైన స్థలాలు నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనానికి కుట్రపన్నినట్లు సమాచారం.
భూకుంభకోణంలో మాజీమంత్రి బాలినేనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ఈ క్రమంలో 2 రోజుల్లో నిందితుల వివరాలు బహిర్గతం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీపై బాలినేని ఒత్తిడి తెచ్చారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నిందితుల పాత్ర నిర్ధారించుకోవాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీ.. తాను చెప్పినట్లు వినట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని.. తనకు కేటాయించిన గన్‌మెన్లను తిప్పిపంపారు. ఇదే విషయమై గురువారం రోజున.. బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంవో అధికారి ధనుంజయరెడ్డిని కలిశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ బదిలీ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎస్పీ బదిలీ కుదరదని బాలినేనికి సీఎంవో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భూ కుంభకోణంలో మీ జోక్యం వద్దని కూడా బాలినేనికి సీఎంవో సూచించిందని సమాచారం. ఇదే సమయంలో... భూ కుంభకోణం పూర్తివివరాలతో రావాలని ఎస్పీ మలికాగార్గ్‌కు సీఎంవోకు ఆదేశించడం మరోసారి చర్చనియాంశంగా మారింది.