తాజ్‌మహల్ సంరక్షణ బాధ్యతలు చూసే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)కి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)మరో సారి నోటీసులు పంపించింది. తాజ్‌మహల్‌కు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించి బకాయి పడ్డ బిల్లులను చెల్లించమని కోరుతూ ఆగ్రా జల్కల్ విభాగం తరఫున నోటీసులు పంపించినట్లు ఆగ్రా మున్సిపల్ అధికారులు తెలిపారు.
తాజాగా పంపిన నోటీసులో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ ఛార్జీల కింద మొత్తం రూ.1.96 కోట్లు విలువైన 13 బిల్లులను పంపడం ఏఎస్‌ఐ అధికారులను షాక్‌కు గురిచేసింది. ఈ పన్నులపై ఏఎస్‌ఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తాజ్‌మహల్‌తో సహా దేశంలోని అనేక స్మారక చిహ్నాలకు ఈ రకమైన పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
వాస్తవానికి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం-1904 ప్రకారం చారిత్రక కట్టడాలకు ఇటువంటి పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 3,693 వారసత్వ ప్రదేశాలకు ఏఎస్‌ఐ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తోంది.
అంతకుముందు ఆగ్రా మున్సిపల్ కార్పోరేషన్(ఏఎంసీ) తాజ్‌మహల్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ కింద రూ.1.47 లక్షల బిల్లును చెల్లించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)కు నోటీసు పంపిన విషయం తెలిసిందే.