నోరూరించే రకరకాల మామిడిపండ్లు తినాలని చాలా మందికి ఉంటుంది. అయితే.. ఎన్నో రకాలున్న ఈ మామిడి పండ్లు ఒకే చెట్టుకు కాస్తే.. నిజంగా ఈ ఊహెంతో బాగుంది కదూ! ఇది నిజం చేసి చూపించారు ఉత్తర్‌ప్రదేశ్ సహారన్పుర్కు చెందిన హార్టికల్చర్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారు. ఏకంగా 121 జాతుల మామిడి పండ్లు ఒకే చెట్టుకు కాసేలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఇది ఎలా సాధ్యమైందంటే..
అరుదైన చెట్టు...
సహారన్‌పుర్ జిల్లాలోని కంపెనీ బాగ్ ప్రాంతంలో ఈ అరుదైన మామిడి చెట్టు ఉంది. ఐదేళ్ల క్రితం ఉద్యాన అధికారులు చేపట్టిన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు 121 రకాల మామిడి పండ్లు కాయడం సాధ్యమైంది.
" వెరైటీ మామిడి పండ్లను తయారు చేసేందుకే ఈ ప్రయోగం చేశాం. అయితే.. ఒకే చెట్టుపై 121 రకాల మామిడి మొక్కలను అంటుకట్టాలనే ఆలోచన ట్రైనింగ్ సెంటర్ గత జాయింట్ డైరెక్టర్ రాజేశ్ ప్రసాద్‌కు వచ్చింది. సామాన్య పౌరులు కూడా ఈ విధానాన్ని ఉపయోగించొచ్చు."
- భాను ప్రకాశ్ రామ్, జాయింట్ డైరెక్టర్.
ప్రముఖ రకాలన్నీ..
దుస్సేరి, లంగ్రా, ఛౌన్సా, రామ్కెలా, అమ్రపాలి, సహారన్‌పుర్ అరుణ్, సహారన్‌పుర్ వరుణ్, సహారన్‌పుర్ సౌరభ్, సహారన్‌పుర్ గౌరవ్, సహారన్‌పుర్ రాజీవ్ మొదలైన మామిడిపండ్ల రకాలు ఈ చెట్టుకు కాస్తున్నాయి. ఈ జాబితా ఇంకా పెద్దదే.
300 రకాలు.. రికార్డు!
ఒకే చెట్టుపై 300 రకాల మామిడి వెరైటీలు ఇప్పటి వరకు రికార్డు. ఈ రికార్డును ఉత్తర్‌ప్రదేశ్ మలిహాబాద్‌కు చెందిన హజి కలీముల్లా ఖాన్ సాధించారు. ఈయనకు 'మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా' అనే బిరుదు కూడా ఉంది. 2008లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.
ఇదీ చదవండి:ఒకే మామిడి చెట్టుకు 20 జాతుల పండ్లు