One Family Only Living In Village : ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉంది. కానీ ఎవరూ అక్కడికి వెళ్లరు. కొండపైన దేవాలయం కూడా ఉంది. కానీ అందులో దేవుడు ఉండడు. పెద్ద నీళ్ల ట్యాంకు కూడా ఉంది. కానీ అందులో నీళ్లు ఉండవు. ఇదేం గ్రామం అనుకుంటున్నారా? ఇంకా ఇక్కడ నివసించే ప్రజల జనాభా తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ఈ వింత గ్రామం కథేంటో మీరూ తెలుసుకోవాల్సిందే!
మహారాష్ట్ర మేల్ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివసించేవి. రెండు దశాబ్దాల క్రితం మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ను చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా సుమారు 37 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని గుర్తించారు. ఈ నిర్ణయం ప్రకారం ఇప్పటికే 17 గ్రామాలను తరలించగా, మరో 6 గ్రామాల తరలింపు జరుగుతోంది. ఈ క్రమంలోనే పిలీ అనే గ్రామంలోని సుమారు 500 కుటుంబాలు 2021లో ఖాళీ చేసి వెళ్లాయి. అయితే, బలవంతంగా ఖాళీ చేయించాలనే నిబంధన లేకపోవడం వల్ల అధికారులు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. కానీ ప్రభుత్వ నోటీసులతో అందరూ వెళ్లిపోగా, భోగిలాల్ కుటుంబం మాత్రం ఇక్కడే నివసిస్తోంది. అతడితో పాటు భార్య, పిల్లలు కలిపి మొత్తం ఆరుగురు ఈ గ్రామంలోనే ఉంటున్నారు.
"నాకు ఇక్కడ 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద ఇల్లు ఉంది. 8 ఆవులు, 15-20 కోళ్లు ఉన్నాయి. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉన్నాను. నా పెద్ద కొడుకు వివాహం కూడా జరిగింది. అతడు భార్యతో కలిపి ఇక్కడే ఉంటున్నాడు. మరో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వారిని నేనే బైక్పై తీసుకెళ్లి సమీప గ్రామంలోని పాఠశాలలో దించేసి వస్తాను. నా వ్యవసాయ భూమికి, ఇల్లుకి సమానమైన ధర చెల్లిస్తే ఇక్కడి నుంచి వెళ్లేందుకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ, ప్రభుత్వం కేవలం రూ. 10 లక్షలు ఇస్తుంది. ఆ డబ్బుతో నేను ఏం చేసుకోవాలి?"
--భోగిలాల్ భాయిట్కర్, గ్రామ నివాసి
"పునరావాస కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఇస్తోంది. ఇందులో రూ. 5 లక్షలు బ్యాంకులోనే డిపాజిట్ చేస్తుంది. మిగతా రూ. 5 లక్షలతో స్థలం, ఇల్లు కొనుక్కోవడం ఆసాధ్యం. అక్కడ వెళ్లాక ప్రతీదీ కొనుక్కోవాలి. ఇక్కడైతే కట్టెలు, నీరు ఉచితం. మరుగుదొడ్డి సదుపాయం కూడా ఉంది. నది కూడా దగ్గరగా ఉంటుంది."
సంగీత భాయిట్కర్, మహిళ
గ్రామానికి రాకుండా రోడ్డు బంద్!
ఇక్కడికి ఎవరూ రాకుండా గ్రామానికి వచ్చే రోడ్డును కూడా మూసివేశారు అధికారులు. అయినా సరే తాము బంధువులు ఇంటికి వెళ్తామని, వారు సైతం తమను చూసేందుకు ఇక్కడికి వచ్చివెళ్తుంటారని చెబుతోంది సంగీత. తమ గ్రామానికి రావడాన్ని నిషేధించినా, తమను చూసేందుకు అనేక మంది బంధువులు వస్తుంటారని చెప్పింది. ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తోంది.
చిన్న ఊరిలో 100 CCTV కెమెరాలు- ప్రెసిడెంట్ చొరవతో ఫుల్ సెక్యూరిటీ!
Hometown Of Teachers Inchal : ఒకప్పుడు చదువు నిల్.. ఇప్పుడు గ్రామం నిండా టీచర్లే.. ఎలా సాధ్యమైందంటే?