One Family In Village : ఒకప్పుడు ఊరి నిండా జనాభాతో కళకళలాడిన ఆ గ్రామం.. ఇప్పుడు ఎవరూ లేక బోసిపోయింది. చిన్నాపెద్దా అంటూ తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండే ఆ ఊర్లో ప్రస్తుతం ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. వరదల వల్ల పాడైపోయిన రహదారిని.. ప్రభుత్వం తిరిగి నిర్మించకపోవడం వల్ల గ్రామం నుంచి ఒక్కో కుటుంబం వలస వెళ్లిపోయాయి. చివరకు ఐదుగురే ఆ గ్రామంలో మిగిలారు.
Single Family In Village : అసోంలోని నల్‌బరి జిల్లాలో ఉన్న బర్ధ్‌నారా గ్రామంలో ప్రస్తుతం ఐదుగురు సభ్యులతో కూడిన ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది. కొన్నేళ్ల క్రితం బర్ధ్‌నారా వెళ్లేందుకు నిర్మించిన రహదారిని అప్పటి ముఖ్యమంత్రి బిష్ణురామ్ మేధి స్వయంగా ప్రారంభించారు. తరచుగా వరదలు సంభవించడం వల్ల ఆ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ప్రభుత్వం తిరిగి ఆ రోడ్డును నిర్మించకపోవడం వల్ల గ్రామం నుంచి ఒక్కో కుటుంబం వలస వెళ్లిపోవడం ప్రారంభించాయి.
![One Family In Village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/19389110_fm.jpg)
రోడ్డే కాదు.. కరెంట్ కూడా..
Unique Village With One Family : 2011 జనాభా లెక్కల ప్రకారం బర్ధ్‌నారా గ్రామంలో 16 మంది నివసించేవారు. ప్రస్తుతం మాత్రం బీమ్లా దేకా అనే వ్యక్తి తన భార్య అనిమా, ముగ్గురు పిల్లలు నరేన్, దీపాలి, స్యూటీలతో కలిసి బర్ధ్‌నారాలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో రోడ్డు సదుపాయంతోపాటు కరెంటు వసతి కూడా లేదు. వర్షాల కారణంగా గ్రామంలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తరచూ భారీ వర్షాలు కురవడం వల్ల గ్రామంలోని దారులు జలమయం అవుతాయని, అప్పుడు పడవ సాయంతో ఊరు దాటాల్సిందేనని బీమ్లా తెలిపాడు.
![One Family In Village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/19389110_jam.jpg)
స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగానే..
"మా గ్రామ పరిస్థితి గురించి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నోసార్లు విన్నవించాం. కానీ అధికారుల నుంచి కనీస స్పందన లేదు. పిల్లలు స్కూలు, కాలేజీకి వెళ్లేందుకు ఏదైనా వాహనం ఎక్కాలన్నా.. గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు నీళ్లు, బురదతో నిండిన దారిలోనే రావాలి. వర్షాకాలంలో పడవ సాయంతో పిల్లలను రోడ్డు దగ్గర విడిచిపెడతాం. కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల కిరోసిన్ దీపాల వెలుతురులోనే చదువుకోవాల్సిన పరిస్థితి. వ్యవసాయం, పశువుల పెంపకమే మాకు ప్రధాన ఆదాయ వనరు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామంలో ఈ పరిస్థితి తలెత్తింది" అంటూ అనిమా ఆవేదన వ్యక్తం చేసింది.
'గ్రామానికి రోడ్డు, కరెంటు సౌకర్యాలు కల్పిస్తే..'
గ్రామ్య వికాస్ మంచా అనే ఎన్‌జీఓ సంస్థ.. బర్ధ్‌నారా పరిస్థితి గురించి తెలుసుకుని స్పందించింది. గ్రామంలోని భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తోంది. దానివల్ల ప్రజలు గ్రామంలోకి వచ్చి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తారని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎన్‌జీఓ ప్రతినిధులు కోరుతున్నారు. గ్రామానికి రోడ్డు, కరెంటు సౌకర్యాలు కల్పిస్తే ఊరు విడిచి వెళ్లినవారు తిరిగి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.