Devaragattu Banni Festival Celebrations : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే కర్రల సమరంలో ఈ ఏడాదీ హింస తప్పలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా వేలాది మంది ప్రజలు బన్ని ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించలేదు. దేవరగట్టులో మరోసారీ సంప్రదాయమే గెలిచింది. ఉత్సవ విగ్రహాలను కాపాడుకునే క్రమంలో సుమారు 100 మంది గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Devaragattu Traditional Stick Fight Festival Video : కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా విజయ దశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీగా వస్తోంది. హోళగుంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలసిన మల్లమ్మ, మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా ఆరు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల ముందు కర్రలతో తలపడ్డారు. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు.
Devaragattu Banni Festival Celebrations: దేవరగట్టు కర్రల యుద్ధం.. తిలకించేందుకు భక్తులు సిద్ధం.. పోలీసుల వ్యూహం ఫలిస్తుందా?
తరలి వచ్చిన లక్షలాది భక్తులు : మల్లమ్మ, మల్లేశ్వరస్వామి వార్లు రాక్షస సంహారం చేసిన తర్వాత బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు దైవాన్ని స్వాధీనం చేసుకునేందుకు నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు.
ఫలించని పోలీస్ చర్యలు.. ఒకరు మృతి : బన్నీ ఉత్సవంలో హింసను ఆపేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేశారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహించారు.ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ సంప్రదాయాన్ని మాత్రం కొనసాగించారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తిలకించడానికి వచ్చిన వారిలో ముగ్గురు మృతి చెందారు. కర్రల సమరం చూసేందుకు చెట్టు ఎక్కిన స్థానిక ప్రజలు చెట్టు ఎక్కారు. చెట్టు కొమ్మ విరిగి పడి ఇద్దరు, ఊపిరాడక మరొకరు మృతి చెందారు. ఆస్పరికి చెందిన గణేష్ (19), రామాంజనేయులు(54) చెట్టు పైనుంచి పడి చనిపోయారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక మూర్చతో బళ్లారికి చెందిన కురువ ప్రకాష్(35) మృతి చెందారు. కర్రల సమరంలో సుమారు 100 మంది గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారి మృతదేహాలు, గాయపడిన వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.