దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా విదేశీ వ్యాక్సిన్‌లకూ అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగ అనుమతిని భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఏడాదికి 85 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే 59 దేశాల్లో స్పుత్నిక్-వి టీకాను అనుమతించారు. భారత్ ఆ టీకాను ఉపయోగించే 60వ దేశమైంది. దేశీయంగా ఈ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.
ప్రస్తుతం ఇతర దేశాల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను 10 డాలర్లకు విక్రయిస్తున్నారు. మరోవైపు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) 'కొవిషీల్డ్' టీకా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ‘కొవాగ్జిన్’ టీకాలకు ప్రభుత్వం 2 డాలర్లు మాత్రమే చెల్లిస్తోంది. ఆ ధరకు స్పుత్నిక్ టీకా లభిస్తుందా అనేదానిపై మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
'ఆస్ట్రాజెనికా' వ్యాక్సిన్‌తో పోలిస్తే, ఇతర మార్కెట్‌లలో స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ధర ఎక్కువ ఉంది. భారత్‌లో ధర ఎంత ఉంటుందనే దానిపై, 'కచ్చితంగా చెప్పలేను. ఉత్పత్తి ప్రక్రియ మొదలయ్యాకనే ఆ విషయం తెలుస్తుంది' అని ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. ధరల నియంత్రణకు సంబంధించి విధివిధానాలను తాము అర్థం చేసుకోగలమని ఆయన అన్నారు. ప్రైవేట్ మార్కెట్‌కు, ప్రభుత్వంతో ఒప్పందానికి మధ్య తప్పకుండా ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చని చెప్పారు. ఏప్రిల్ చివరి నాటికి స్పుత్నిక్ వ్యాక్సిన్ భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
టీకా గురించి మరింత సమాచారం
- 'స్పుత్నిక్-వి' టీకా 91.6% ప్రభావశీలత కలిగినదిగా మూడో దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర విశ్లేషణల్లో నిర్ధరణ అయినట్లు ఆర్‌డీఐఎఫ్ ప్రకటించింది.
- దీన్ని 2 నుంచి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేసే వీలుంది. దాంతో టీకా భద్రపరచడం, పంపిణీకయ్యే వ్యయాలు తగ్గుతాయి.
- ఇది కూడా 2 డోసుల టీకా. మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వాలి. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
- టీకా తీసుకున్న తర్వాత జ్వరం రావచ్చు. పారాసెట్మాల్ ట్యాబ్లెట్ వాడితే సరిపోతుంది. దీనికి మించి ‘సైడ్ ఎఫెక్ట్స్’ ఉండవని ఆర్‌డీఐఎఫ్ వివరించింది.
- అన్ని వయస్కుల వారిలోనూ 'స్పుత్నిక్ వి' టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలుపుతున్నారు.