Independence Day Principal Liquor Party in School : పంద్రాగస్టు రోజున స్కూల్లోనే లిక్కర్ పార్టీ చేసుకున్నాడు ఓ ప్రిన్సిపల్. తోటి ఉపాధ్యాయుడితో కలిసి పాఠశాలలో మందుకొట్టాడు. అంతే కాకుండా ముగ్గురు విద్యార్థినులను టాయిలెట్లోకి తీసుకెళ్లి అసభ్య చిత్రాలు, వీడియోలు చూపించాడు. గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
Gujarat Vadodara School Principal Liquor party : వడోదరలోని పద్రా తాలుకా అభోర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభోర్ ప్రైమరీ స్కూల్లో జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు పూర్తయ్యాక.. అతిథులు, విద్యార్థులు వెళ్లిపోయారు. కొంతమంది బాలురు, బాలికలు మాత్రమే స్కూల్లో ఉన్నారు. ఈ సమయంలోనే స్కూల్ ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ జాదవ్, టీచర్ రమేశ్‌భాయ్ పాంచల్.. పాఠశాలలో సిట్టింగ్ వేశారు. తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించారు. మహేంద్రభాయ్ జాదవ్.. ముగ్గురు విద్యార్థినులను స్కూల్ టాయిలెట్లోకి తీసుకెళ్లాడు. తన ఫోన్లో ఉన్న అసభ్య ఫొటోలు, వీడియోలు వారికి చూపించాడు.
ప్రిన్సిపల్‌కు దేహశుద్ధి!
వీడియోలు, ఫొటోలు చూసి షాక్ అయిన బాలికలు.. ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు విషయం గురించి చెప్పారు. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. స్కూల్‌కు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీశారు. తల్లిదండ్రులు స్కూల్‌కు రావడం చూసి చుట్టుపక్కల వారు సైతం పాఠశాల వద్ద పెద్ద ఎత్తున పోగయ్యారు. ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ జాదవ్‌ను స్కూల్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతడికి దేహశుద్ధి చేశారు.
చివరకు ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. నిమిషాల్లోనే వడు పోలీసులు అభోర్ గ్రామానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ను విడిపించారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కూల్లో మద్యం తాగినందుకు మరో టీచర్ రమేశ్‌భాయ్ పాంచల్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, నిందితులిద్దరినీ సస్పెండ్ చేసినట్లు ప్రాథమిక విద్యా కమిటీ ఛైర్మన్ అశ్విన్‌భాయ్ పటేల్ స్పష్టం చేశారు.
"విద్యావ్యవస్థకు అవమానం కలిగించే ఘటన ఇది. మహేంద్రభాయ్ జాదవ్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. అవి క్షమార్హం కాదు. మరో టీచర్ రమేశ్‌భాయ్ సైతం తాగి పట్టుబడ్డాడు. ఇద్దరిపై వాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇద్దరూ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఫిర్యాదు నమోదు కాగానే ఇద్దరినీ సస్పెండ్ చేశాం."
-అశ్విన్‌భాయ్ పటేల్, ప్రాథమిక విద్యా కమిటీ ఛైర్మన్
ఎమ్మెల్యే ఫైర్..
స్థానిక ఎమ్మెల్యే చైతన్య సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు చేసిన పని అవమానకరమని వ్యాఖ్యానించారు. టీచర్లు ఇలా ప్రవర్తిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను తాను కోరినట్లు వివరించారు.
గ్యాస్ లీక్.. స్కూల్లో స్పృహతప్పి పడిపోయిన 24 మంది పిల్లలు
ఐఫోన్ కోసం దారుణం.. లేడీ టీచర్‌ను రోడ్డు మీద లాక్కెళ్లిన దొంగలు