Omicron Patients recovered without medication: ఒమిక్రాన్ బాధితులకు.. మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, పారాసెటమాల్తోనే చికిత్స అందిస్తున్నట్లు దిల్లీ లోక్‌నాయక్ ఆస్పత్రి(ఎల్ఎన్జేపీ) వైద్యులు ఇటీవల తెలిపారు. ఇప్పుడు మరింత ఊరట కల్పించే విషయాన్ని చెప్పారు. చాలా మంది ఎలాంటి ఔషధాలు వాడకుండానే కోలుకున్నారని వెల్లడించారు. అలా 51 మందిలో 40 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు.
''ఈ ఆస్పత్రిలో చేరిన 51 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 40 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో చాలా మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. ఎలాంటి ఔషధాలు కూడా అవసరం రాలేదు. ఎవరికీ ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్, స్టెరాయిడ్లు, రెమ్‌డెసివిర్ ఇవ్వలేదు.''
- డా. సురేశ్ కుమార్, ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఎండీ
Omicron Patients: ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు. మాస్కులు ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
దిల్లీలో ఎల్ఎన్జేపీ ఆస్పత్రితో పాటు సర్ గంగారామ్ సిటీ హాస్పిటల్, మ్యాక్స్ హాస్పిటల్ సాకెత్, ఫోర్టిస్ హాస్పిటల్, బత్రా హాస్పిటల్లో ఒమిక్రాన్ అనుమానిత కేసుల కోసం ఐసోలేషన్‌తో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.
దేశ రాజధానిలో రోజుకు లక్ష కేసులొచ్చినా చికిత్స అందించేలా వైద్యపరమైన ఏర్పాట్లు చేసినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నందున ఇంట్లోనే చికిత్స అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రోజుకు మూడు లక్షల కరోనా టెస్టులు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
పెరుగుతున్న కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లకూ విస్తరించింది.
8 Omicron cases found in Indore
మధ్యప్రదేశ్ ఇందోర్‌లో ఒక్కరోజే 8 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి ఇటీవల రాష్ట్రంలోకి 3 వేల మందికిపైగారాగా అందులో 26 మంది వైరస్ బారినపడినట్లు తెలిపారు.
Himachal Pradesh reports first Omicron case
హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితమే మండీ జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. కెనడా నుంచి వచ్చిన మహిళకు డిసెంబర్ 12నే వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ 24న మళ్లీ నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
Odisha reports four new omicron cases
ఒడిశాలో ఆదివారం మరో నలుగురికి ఒమిక్రాన్ సోకింది. వీరిలో ఇద్దరు నైజీరియా, మరో ఇద్దరు యూఏఈ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8కి చేరింది.
3 నుంచి పిల్లలకు టీకా..
దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. ఒమిక్రాన్ రకం వైరస్ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై 'ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసు' టీకా అందించనున్నామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి: Vaccination for Children: జనవరి 3 నుంచి పిల్లలకు టీకా