Omicron India News: యూకే, నెదర్లాండ్స్ నుంచి బుధవారం.. దిల్లీకి చేరుకున్న నలుగురు ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకుగానూ వారి నుంచి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు పేర్కొన్నారు. ఆమ్స్టర్డామ్, లండన్ నుంచి మొత్తంగా నాలుగు విమానాల్లో 1,013 మంది ప్రయాణికులు దిల్లీకి చేరుకోగా.. వారిలో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని స్పష్టం చేశారు.
ఈ నలుగురిని దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్పించారు. మిగతా రోగులతో కలవకుండా ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన నలుగురు భారతీయులేనని అధికారులు తెలిపారు.
యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లతో పాటు మరికొన్ని ఐరోపా దేశాలను కేంద్రం 'ఎట్ రిస్క్' కంట్రీస్‌గా గుర్తించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులు భారత్‌కు చేరుకుంటే.. కేంద్రం సూచించిన అదనపు జాగ్రత్తలను పాటించాలి.
కొత్త నిబంధనల ప్రకారం.. 'ఎట్ రిస్క్' దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. ఫలితం వచ్చే వరకు వారు విమానాశ్రయం వదిలి పెట్టకూడదని షరతు విధించింది.
ఇదీ చూడండి: Omicron In India: ఆ దేశ ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్