Omicron cases in India: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'.. భారత్‌లో క్రమంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కొత్త రకం కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఏడు కేసుల్లో ముంబయిలో 3, పింప్రి చించ్వాడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 కేసులు ఒక్కరోజే వెలుగు చూశాయి.
ముంబయిలోని ధారావిలో టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. బాధితుడిని సెవన్ హిల్స్ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఐదుగురికి నెగెటివ్..
పుణెలో ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు కోలుకున్నట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. జిల్లాలోని పింప్రి చించ్వాడా ప్రాంతంలో ఉన్న ఆరుగురిలో నలుగురు, పుణె నగరంలో ఓ వ్యక్తికి నెగటివ్‌గా తేలింది. 'మొత్తంగా ఏడుగురి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది' అని పవార్ తెలిపారు.
దేశంలో 32కు ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో ఇప్పటికే 10 ఒమిక్రాన్ కేసులు ఉండగా శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి కొత్త వేరియంట్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 32 కేసులు నిర్ధరణ అయ్యాయి.
- మహారాష్ట్ర- 17
- రాజస్థాన్- 9
- గుజరాత్- 3
- కర్ణాటక- 2
- దిల్లీ- 1
ఇదీ చూడండి: కరోనా సెకండ్ వేవ్‌లో వైద్యం కోసం లంచం ఇచ్చిన 40% ప్రజలు!