ఫోన్ పేలి 60 ఏళ్ల వృద్ధుడు తీవ్రగాయాలతో మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగింది. మృతుడిని దయారామ్ బరోద్గా పోలీసులు గుర్తించారు. మృతుడి మెడ, ఛాతీ భాగాలలో తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఛార్జింగ్ పెట్టే కరెంట్ బోర్డు ప్లగ్ బోర్డు కాలిపోయిందని వెల్లడించారు.
మృతుడు దయారామ్కి ఇందోర్‌కు చెందిన బంధువు దీపక్ ఫోన్ చేశాడు. దయారాం ఫోన్ కలవలేదు. అనుమానం వచ్చిన దీపక్.. బంధువులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలికి చేరుకుని చూడగా దయారామ్ విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
"వృద్ధుడు దయారామ్ బరోద్.. రూనిజా రోడ్డులోని తన పొలంలో ఒంటరిగా ఉండేవాడు. అకస్మాత్తుగా మొబైల్ ఫోన్ పేలి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాల కారణంగా ఆ వ్యక్తి మరణించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. మొబైల్ ఫోన్, స్విచ్ బోర్డులు కాలిపోయాయి. ఘటనాస్థలిలో ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు"
--పోలీసులు
వేటకు వెళ్లి ఇద్దరు..
కర్ణాటకలోని చిక్కమగళూరులో ముళ్లపంది వేటకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తమిళనాడుకు చెందిన విజయ్(28), శరత్(26)గా పోలీసులు గుర్తించారు. మలిగనాడు సమీపంలోని ఓ ఎస్టేట్‌లో పని చేస్తున్న కూలీలు ముళ్లపందులను వేటాడేందుకు కొండలపైకి వెళ్లారు. ఇరుకైన సొరంగంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు పందికొక్కు బయటకు రావడం కోసం పొగ పెట్టారు. ఈ క్రమంలోనే వారు ఆ పొగను పీల్చి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ పేలి బాలుడికి గాయాలు.
2021లో మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా ఫోన్ పేలి.. ఓ 15 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్ కుయియా గ్రామానికి చెందిన రామ్‌ప్రకాశ్ భదౌరియా 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఫోన్లో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతడి చేతిలోని ఫోన్ పేలింది. దీంతో అతని దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని నగోడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్పీ మిశ్రా తెలిపారు.