బిహార్ ముంగేర్ జిల్లా జగత్‌పుర్ గ్రామంలో ఓ వృద్ధుడిపై పక్కింటి వ్యక్తి, మరికొందరు కలిసి దాడి చేయగా అతడు మరణించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడి భార్యను మృతుడు 'టమాట' అంటూ ఆటపట్టించాడన్న ఆరోపణే ఈ గొడవకు కారణమని పోలీసులు చెప్పారు.
ట'మాట' ఖరీదు.. నిండు ప్రాణం!: మహేశ్ దాస్(56), బ్రహ్మదేవ్ దాస్.. ఇరుగుపొరుగు వారు. మంగళవారం సాయంత్రం కూరగాయలు కొనేందుకు మహేశ్ మార్కెట్‌కు వెళ్లాడు. ఎవరో తెలిసిన వ్యక్తి కనిపిస్తే మాట్లాడుతూ నిల్చున్నాడు. 'నేను టమాట కొనడం మర్చిపోయాను' అని అన్నాడు మహేశ్. అలా పదేపదే టమాట గురించి మాట్లాడాడు. అదే సమయానికి మహేశ్ పక్కింట్లో ఉండే బ్రహ్మదేవ్ దాస్ భార్య అక్కడే ఉంది. టమాట అంటూ తననే ఆటపట్టిస్తున్నాడని అనుకున్న ఆమె.. ఇంటికి వెళ్లి భర్తకు చెప్పింది.
ఆవేశంతో ఊగిపోయిన బ్రహ్మదేవ్ దాస్.. మహేశ్ ఇంటికి వెళ్లి అతడ్ని నిలదీశాడు. అలాంటిదేమీ లేదంటూ మహేశ్ ఎదురుదాడికి దిగాడు. కోపోద్రిక్తుడైన బ్రహ్మదేవ్.. పొరుగింటి వ్యక్తిపై దాడి చేశాడు. మరికొందరు కూడా అతడికి సహకరించారు. క్షణాల్లోనే మహేశ్ సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధరించారు. మహేశ్ కుటుంబసభ్యులు.. బ్రహ్మదేవ్ సహా మొత్తం ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చేలోపే బ్రహ్మదేవ్ కుటుంబం పరారైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
"మహేశ్‌ను నిందితులు తీవ్రంగా కొట్టలేదు. మృతుడి శరీరంపై తీవ్రమైన గాయాలేవీ లేవు. అయితే దాడి చేయగానే అతడు కిందపడిపోయాడు. గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయి" అని చెప్పారు కేసును పర్యవేక్షిస్తున్న ఖడగ్పుర్ డీఎస్పీ రాకేశ్ కుమార్.