ప్రేమకు వయసుతో సంబంధం లేదని కవులు చెబుతుంటారు. నిజమే! ప్రేమ ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరి మనసుల్లోనైనా చిగురించే అవకాశం ఉంది. 'వీరి మీద ప్రేమ పుడుతుంది', 'ఈ సమయంలోనే ప్రేమ పుడుతుంది' అని ఈ సృష్టిలో ఎవరూ చెప్పలేరు. ఇది నిజమని నిరూపించే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇద్దరు వృద్ధుల మధ్య ప్రేమ పుట్టింది. ఏడు పదుల వయసులో పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది. వృద్ధాశ్రమమే వీరి వివాహానికి వేదికైంది. ప్రేమించే మనసు ఉంటే చాలు ఏజ్‌తో సంబంధం ఏంటని రుజువు చేసిందా జంట.
కొల్హాపుర్‌లోని శివ్నాక్వాడిలో నివసంచే బాబురావ్ పాటిల్, వాఘోలీ ప్రాంతానికి చెందిన అనసూయ శిందే ఏడు పదుల వయసులో ప్రేమలో పడ్డారు. బాబురావ్ వయసు 75 కాగా... అనసూయకు 70ఏళ్లు. శిరోల్ తాలుకాలోని ఘోసర్వాడ్ ప్రాంతంలో ఉన్న జానకీ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు. వీరిద్దరి జీవిత భాగస్వాములు గతంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక వృద్ధాశ్రమానికి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది.

ఒకరినొకరు చూసుకోవడంతో మొదలై.. అన్ని విషయాలు పంచుకునే వరకు వెళ్లింది. చివరకు అదే సాన్నిహిత్యం పెళ్లికి దారితీసింది. జీవిత చరమాంకంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని అనుకొని పెళ్లికి సిద్ధమైందీ జంట. ఆశ్రమంలో డ్రైవర్‌గా పనిచేసే బాబా సాహెబ్ పూజారి అనే వ్యక్తి బాబురావ్, అనసూయ పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. న్యాయపరమైన ప్రక్రియలన్నీ ఆయనే పూర్తి చేశారు. సాక్షి సంతకం కూడా ఆయనే పెట్టారు. ప్రస్తుతం ఈ వివాహం స్థానికంగా బాగా పాపులర్ అయింది. ఈ జంట వివాహం గురించే అంతా చర్చించుకుంటున్నారు.
ఆస్పత్రి గదే పెళ్లి వేదిక..
కాగా, ఇటీవల రాజస్థాన్‌లో వినూత్నంగా వివాహం జరిగింది. మెట్లపై నుంచి జారి పడ్డ వధువు ఆస్పత్రిలో చేరగా.. వరుడు ఆమెకు అక్కడే తాళి కట్టేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఓ గదిని బుక్ చేసి వివాహ తంతు జరిపించారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.