కర్ణాటకలోని బెళగావి.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ 80 ఏళ్ల వృద్ధురాల్ని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి ఆస్తి పంపకాల దస్తావేజులపై సంతకం చేయించారు. అది చూసిన పలువురు.. అధికారుల తీరుపై విమర్శిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం తమ తప్పేం లేదని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే.. బెళగావి తాలూకాలోని హిరేబాగేవాడి ప్రాంతానికి చెందిన మహాదేవి(80) గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే మహాదేవి పేరు మీద 2 ఎకరాల 35 గుంటల భూమి ఉంది. ఆ భూమిపై తమకు హక్కు కల్పించాలని ఆమె పిల్లలు విద్యా హోస్మని(54), రవీంద్ర గురప్ప హోస్మాని(51) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఆస్తి పంపిణీకి సంబంధించిన టైటిల్ డీడ్‌పై సంతకం చేయడానికి మహాదేవి కార్యాలయానికి రావాల్సి ఉంది. దీంతో ఆమెను ఆస్పత్రి నుంచి కార్యాలయానికి అంబులెన్స్‌లో తీసుకొచ్చి సంతకాలు చేయించారు మహాదేవి పిల్లలు.
ఫలితంగా.. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాణాలతో పోరాడుతున్న వృద్ధురాల్ని ఇలాంటి సమయంలో రిజిస్ట్రార్ ఆఫీస్‌కు రప్పించడమేమిటని పలువురు విమర్శించారు. అయితే అధికారులు తీసుకురమ్మనందుకే ఇలా చేశామని బంధువులు చెబుతున్నారు. కానీ, దరఖాస్తుదారులు ప్రైవేటు అటెండెన్స్‌కు అప్లై చేసుకోకపోవడం వల్లే తమ సిబ్బంది ఆస్పత్రికి వెళ్లలేదని, అందుకే మహిళను తీసుకురమ్మని చెప్పామని సబ్ రిజిస్ట్రార్ అధికారి సచిన్ మండేడా చెబుతున్నారు.
ప్రైవేటు అటెండెన్స్ అంటే ఏమిటి?
కొన్ని సందర్భాల్లో ఆస్తి పంపకాల దస్తావేజులపై సంతకం చేయడానికి వ్యక్తులు పలు కారణాల వల్ల రావడానికి వీలు కుదరని పక్షంలో వారి కుటుంబసభ్యులు ప్రైవేటు అటెండెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సంబంధించిన రుసుము రూ.1000 చెల్లించాలి. అప్పుడు రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది.. సంబంధిత వ్యక్తుల దగ్గరకు వెళ్తి సంతకాలు తీసుకుంటారు.
ఇవీ చదవండి: 600 కిలోల బాంబులు.. 6 సెకన్లు.. వంతెన కూల్చేందుకు అర్ధరాత్రి ఆపరేషన్.. సగంలోనే...
సంచిలో శవం.. కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం.. రియల్ లైఫ్‌లో 'దృశ్యం'!