ఝార్ఖండ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం తగ్గినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో నరమేధం కొనసాగతోంది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని తరచూ భీకర దాడులు చేస్తూనే ఉన్నారు. ముఖాముఖీ పోరు కాకుండా మందుపాతరలు, ఐఈడీలు అమర్చి ఎక్కువగా జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. మందుపాతరలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం బలగాల వద్ద ఉన్నప్పటికీ IEDలను గుర్తించడం సాధ్యం కావడం లేదు. IEDలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం బలగాల వద్ద పూర్తిస్థాయిలో లేకపోవడమే తరచూ ప్రాణాలు కోల్పోవడానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి దక్షిణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ సమస్య పెద్ద సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు.
మార్చి-జూన్ మధ్య కాలంలో మావోయిస్టులు తమ దళాలను పెంచుకోవడం సహా పోలీసులపై వ్యూహాత్మక దాడులకు ఎక్కువగా వ్యూహరచన చేస్తూ ఉంటారు. అడవుల్లో చెట్లు ఎండిపోవడం, పచ్చదనం తక్కువగా ఉండడం వల్ల బలగాల కదలికలను తేలిగ్గా గుర్తించడం సహా మాటువేసి దాడులు చేయడం వారికి సులభంగా ఉంటుంది. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ-ఒడిశా సరిహద్దుల్లో భౌగోళికంగా ట్రై-జంక్షన్‌గా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో సుక్మా, దంతెవాడ జిల్లాల్లోనే భారీ దాడులు జరిగాయి. 2010లో ఏకంగా 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దంతెవాడ జిల్లా అరన్‌పూర్‌లో మావోయిస్టులు 50 కిలోల బరువైన భారీ IEDతో దాడికి పాల్పడి 10 మంది డీఆర్జీ పోలీసుల ప్రాణాలు తీశారు.
ఈ ప్రాంతాలు మావోయిస్టు దండకారణ్య స్పెషన్ జోనల్ కమిటీ ఆధీనంలో ఉంటాయి. ఈ దళాలకు PLGA కమాండర్ హిడ్మా నేతృత్వం వహిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ తరహా దాడులకు పథక రచన అంతా హిడ్మా కనుసన్నల్లోనే జరుగుతోంది. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దేశీయ ఆయుధాల్ని, ఐఈడీ బాంబుల్ని, బూబీట్రాప్‌లను తయారు చేయడంలో పట్టున్న హిడ్మా లక్ష్యంగానే ప్రస్తుతం దండకారణ్యంలో బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇతడిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుమారు 45 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
ఈ ప్రాంతాలపై పట్టు కోసం సీఆర్పీఎఫ్ పెద్దఎత్తున రోడ్ల నిర్మాణం సహా స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. అయితే అభయారణ్యాలు కావడం, మొబైల్ సిగ్నల్స్ తక్కువగా ఉండడం భద్రతా సిబ్బందికి అవరోధాలుగా మారాయి. ఈ క్రమంలో ఇటీవల IEDలు పెద్ద సమస్యగా పరిణమించాయని అధికారులు చెబుతున్నారు. తారు రోడ్ల కింద IEDలను అమర్చి మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడుతున్నారని వివరిస్తున్నారు. మొత్తంగా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు భద్రతా సిబ్బంది కృషిచేస్తున్నారని, త్వరలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.