vaccination smartphone: కరోనా కొత్త వేరియంట్ భయాలు వెంటాడుతున్న వేళ అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు, వైద్యరంగ నిపుణులు ప్రముఖులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా సాధ్యమైనంత త్వరగా 100శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నాయి. అయితే, అర్హులైనవారిని వ్యాక్సినేషన్ వైపు ఆకర్షించేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు ఓ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 1 నుంచి 7 వరకు ఎవరైతే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుంటారో లక్కీడ్రా తీసి వారిలో ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు. ఆ విజేతకు ₹60,000 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇవ్వనున్నట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించేందుకు అహ్మదాబాద్ పురపాలక సంస్థ ఇలాంటి ఆకర్షణీయ పథకాలు (vaccination offers) ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా వేలాది మందికి (ముఖ్యంగా మురికివాడల్లో ఉన్న జనాలకు) కిలో చొప్పున వంట నూనె ప్యాకెట్లను పంపిణీ చేసింది.
అహ్మదాబాద్ నగరంలో ఇప్పటివరకు 78.7లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. వారిలో 47.7లక్షల మంది తొలి డోసు; 31 లక్షల మందికి రెండు డోసులూ పూర్తయినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే, ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోని, రెండో డోసు ఇంకా వేయించుకోవాల్సిన వారిని జూ, మ్యూజియాలు, ప్రైవేటు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాంతాలకు అనుమతి నిరాకరించనున్నట్టు ఏఎంసీ అధికారులు హెచ్చరించారు. అర్బన్/కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆస్పత్రుల్లోకి టీకా వేయించుకోనివారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. ఆస్పత్రులకు వచ్చే వారి కోసం ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేస్తామని, టీకా తీసుకోని వారు (రోగి కాకుండా) వస్తే అక్కడే ఆయా సెంటర్ల వద్దే వ్యాక్సిన్ వేయించే ఏర్పాట్లు కూడా చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఇతర రోగాలతో ఆస్పత్రులకు వచ్చే రోగులు ఇంకా కొవిడ్ టీకా వేయించుకోనట్టయితే.. రికవరీ అయ్యాక వారు టీకా పొందేలా కౌన్సిలింగ్ ఇచ్చి.. వారి మెడికల్ కేసు పేపర్లలో వ్యాక్సినేషన్ స్థితిని నమోదు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: అయ్యయ్యో వద్దమ్మ!..టీకా భయంతో ఇంటిపైకి ఎక్కిన వృద్ధుడు