Odisha MLA rams vehicle into crowd: ఒడిశా ఖుర్దాలో లఖింపుర్ ఖేరి తరహాలోనే దుర్ఘటన జరిగింది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది భాజపా కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. వారిని భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు.
పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా.. ఖుర్దా జిల్లాలోని బాన్‌పుర్ బ్లాక్ ఆఫీస్ ముందు ఉన్న ప్రజలపై బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే కారుతో దూసుకెళ్లారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే.. మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్దేవ్ను రక్షించిన పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
జగదేవ్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో గత ఏడాది సెప్టెంబరులో పార్టీ నుంచి బీజేడీ సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.