ఒడిశా జాజ్‌పుర్(Odisha Jajpur News) జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సూక్ష్మ కళాకృతులు(మినియేచర్ ఆర్ట్స్)(Miniature Artwork) తయారు చేస్తూ.. అరుదైన ఘనతలు సాధిస్తున్నాడు.
నతాసాహీ గ్రామానికి చెందిన రాకేశ్ కుమార్ పాత్ర.. ఈ మినియేచర్ ఆర్ట్స్(Miniature Artwork) రూపకర్త. పేద కుటుంబంలో పుట్టిన రాకేశ్‌కు.. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఎంతో ఆసక్తి. ఇప్పటివరకు అతను ఎన్నో శిల్పాలకు రంగులద్ది, అద్భుతమైన కళాకృతులుగా మలిచాడు. వాటితో ఎన్నో చోట్ల ప్రదర్శనలిచ్చాడు.
ప్రపంచ రికార్డు దాసోహం..
ఇటీవలే రాకేశ్... మైనంతో 3.5 సెంటిమీటర్ల పొడవున్న బుద్ధుడి ప్రతిమను అతడు రూపొందించాడు. దీంతో అతని పేరు 'ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్'లో నమోదైంది. అంతేగాకుండా అతడు 0.5 సెంటిమీటర్ల పొడవుతో వేప కర్రలపై పూరీ జగన్నాథుడు సహా బలభద్ర, సుభద్రల ప్రతిమలను తయారు చేశాడు. భూతద్దంతో మాత్రమే చూడగల ఈ ప్రతిమలను చెక్కడం.. ఎంతో సవాలుతో కూడిన పనే అయినా.. రాకేశ్ వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నాడు.
ఎప్పటికైనా.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు రాకేశ్. అతని అద్భుత ప్రతిభను చూసిన వారు ఎవరైనా.. తన కల అతి త్వరలోనే నెరవేరుతుందని కచ్చితంగా చెప్పగలరు! రాకేశ్ సాధించిన విజయాల పట్ల అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుని, తమ కుమారుడికి అండగా నిలబడితే.. అతడు మరిన్ని ఘనతలు సాధించగలడని వారు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 'బుల్లెట్' విడిభాగాలతో 'ఈ-బైక్'- తొమ్మిదో తరగతి విద్యార్థి ఘనత