ఒడిశా అసెంబ్లీలోని భాజపా చీఫ్‌విప్ మోహన్ చరణ్ మాఝిపై ఇద్దరు గుర్తులు తెలియని వ్యక్తులు బాంబులు (Bomb Attack News) విసిరారు. ఈ ఘటన కియోంజర్ జిల్లాలో జరిగింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన మోహన్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. బాంబులు విసిరిన కారణంగా ఆయన వాహనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు.
కియోంజర్ జిల్లాలోని మండువా ప్రాంతంలో కార్మిక సంఘ సమావేశానికి హాజరైన ఆయన ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ వాహనంపై బాంబులు వేసినట్లు మోహన్ తెలిపారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది నిందితులను పట్టకునే ప్రయత్నం చేయగా.. వారు ఘటనా స్థలినుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.
"ఆదివారం నేను ఓ మీటింగ్‌కు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్నాను. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నా కారును ఓవర్‌టేక్ చేశారు. వెంటనే నా వాహనంపై రెండు బాంబులు విసిరారు. ఈ ఘటన ఉదయం 11.50 కి జరిగింది. 20 ఏళ్లుగా నేను రాజకీయంగా శత్రువులను పెంచుకున్నానేమో కానీ, వ్యక్తిగతంగా నాకు శత్రువులు ఎవరూ లేరు.
మోహన్ చరణ్ మాఝి, ఒడిశా చీఫ్ విప్
దాడి చేసిన వారు కచ్చితంగా అధికారంలో ఉన్న బీజేడీకి (BJD News) చెందిన వారై ఉంటారని మోహన్ ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. భాజపా నేతలు జాతీయ రహదారి 49 పై బైఠాయించారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో 40 మంది టీచర్లకు సమన్లు.. 400 మంది అనుమానితుల అరెస్ట్!